-కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్( లాలన్ సింగ్) వెల్లడి
-మొబైల్ వెటర్నరీ యూనిట్లు పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ వెటర్నరీ యూనిట్ల (MVUs) సంఖ్యను గణనీయంగా పెంచింది. పశువైద్యశాలలు , డిస్పెన్సరీల స్థాపన పటిష్టత – మొబైల్ వెటర్నరీ యూనిట్ (ESVHD-MVU) పథకం కింద దేశవ్యాప్తంగా పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 4340 యూనిట్లు మంజూరు చేయగా, 4016 యూనిట్లు సేవలందిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో 340 యూనిట్లు సేవలందిస్తున్నాయి. ఎపి ఈ పథకం కింద రూ. 84.09 కోట్లు నిధులు విడుదల చేయగా, ఎపిలో ఈ పథకం కింద 16 లక్షల 08 వేల 868 మంది రైతులు లబ్ధి పొందినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్( లాలన్ సింగ్) వెల్లడించారు.
పశువైద్యశాలలు , డిస్పెన్సరీల స్థాపన పటిష్టత – మొబైల్ వెటర్నరీ యూనిట్ (ESVHD-MVU) పథకం కింద దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మొత్తం మొబైల్ వెటర్నరీ యూనిట్ల (MVUs) సంఖ్య, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వారీగా వివరాలతో పాటు ఇప్పటివరకు మంజూరై విడుదలైన నిధుల వివరాలు, ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య తెలియజేయాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ను లోక్ సభలో మంగళవారం అడగటం జరిగింది. వీటికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్( లాలన్ సింగ్) లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు.
దేశవ్యాప్తంగా ఈ పథకం కింద ఇప్పటివరకు 997.59 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మొబైల్ వెటర్నరీ యూనిట్లు గ్రామీణ దూరప్రాంతాల్లో ఉన్న రైతులకు అత్యవసర వెటర్నరీ సేవలను అందించేందుకు సహాయపడుతున్నాయన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 340 మొబైల్ వెటర్నరీ యూనిట్లు వుండగా అత్యధికంగా నెల్లూరు జిల్లా 18 , అల్లూరు సీతారామరాజు జిల్లాలో 6 యూనిట్లు వున్నట్లు తెలిపారు. అలాగే కృష్ణ జిల్లాలో 14, ఎన్టీఆర్ జిల్లాలో 11 మొబైల్ వెటర్నరీ యూనిట్లు అందుబాటులో వున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ యూనిట్లు ద్వారా పశువుల ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, అవసరమైన చికిత్సలు నిర్వహించబడుతున్నాయన్నారు. రైతులకు ఇంటివద్దనే మరింత మెరుగైన సేవలు అందించేందుకు హెల్పెలైన్ 1962 నెంబర్ తో పత్రి రాష్ట్రంలో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 66 లక్షల 54 వేల 662 మంది రైతులు మొబైల్ వెటర్నరీ సేవల ద్వారా ప్రయోజనం పొందినట్లు పేర్కొన్నారు.
మొబైల్ వెటర్నరీ యూనిట్ల (MVUs) ఏర్పాటుకు సంబంధించిన 100% ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. కానీ నిర్వహణకి సంబంధించిన ఖర్చులు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భరిస్తాయని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్( లాలన్ సింగ్) వివరించారు.