-అందరికి “శ్రీరామ నవమి” శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుత్రకామేష్టి యాగంలో దశరథ మహారాజుకి జన్మించిన తొలి సంతానమే మన రామయ్య !!
పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో జరిగింది రాముని జననం..
చైత్ర శుద్ధ నవమి నాడే “శ్రీరామ నవమి”.
ఆ రోజే సీతా రాముల పట్టాభిషేకము జరిగినది…
సీతారాముల కళ్యాణం అన్ని రామ మందిరాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు..
వడపప్పు,పానకం,చలిమిడి నైవేద్యం గా సమర్పిస్తారు..
సీతా స్వయంవరంకై రాముడు “మిథిల”వెళ్ళినాడు…
శివధనస్సును అవలీలగా విరిచి,
జానకి మెడలో వేసెను కళ్యాణ మాల…
శ్రీరామనవమిని భద్రాచలం లో చాలా గొప్పగా కళ్యాణం జరిపిస్తారు…
రామనామ భజనలు, కీర్తనలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది…
శ్రీరామ రామ రామేతి శ్లోకం ముమ్మారు పలికిన,
ప్రాప్తించును విష్ణు ,శివ సహస్రనామ పారాయణ దివ్య ఫలితం..
యజ్ఞ రక్షణకై విశ్వామిత్రుని వెనువెంట వెళ్లిన రామయ్య ..
తాటకిని దునిమి, రాతిని నాతిగా చేసిన సుగుణాభిరాముడు…
ధర్మ మార్గానికి మానవ రూపం రామావతారం..
ఆదికవి వాల్మీకి మహర్షి ముఖపద్మము నుండి వెలువడిన రామకథామృతం..
రామాయణ పారాయణం వేద పారాయణం తో సమానం..
ఆపదలను పోగొట్టి సంపదలను కల్గించే లోకాభిరామునికి శత కోటి నమస్కారాలు..
సూర్యవంశ తేజమా ! దశరథ కుమారా !
నీలమేఘశ్యామా ! కోదండ రామా !
సీతా మనోహరా ! భక్తజనప్రియా !
రామా ! రామా అంటూ అందరి హృదయాలలో నిలిచినావు కదా !
ఏకపత్నీవ్రతుడు,పితృవాక్య పరిపాలకుడు, భాతృ వాత్సల్యుడు రఘురాముడు..
శూర్పణఖ ముక్కు చెవులు కోసి శీలవంతుడిగా నిలిచినావు..
సీతాపహరణం భరించక రావణ లంకకు యుద్ధోన్ముఖుడై పయనమయ్యెను..
సుగ్రీవుని స్నేహం కోసం మహా బలశాలి, అధర్మపరుడైన వాలిని వధించెను..
హనుమంతుని తోడుతో లంకలో సీతమ్మ జాడ కనుగొనెను.
వానరసైన్యంతో వారధిని పేర్చి ఉడుత భక్తికి ముగ్దుడై నిలిచే..
వనవాసం, యుద్ధం ముగిసిన తరువాత భరతుని కోరిక మేరకు
రామపట్టాభిషేకము చేసుకొని అయోధ్యను ఏలెను..
రామ రామ రామ రామ రామ రామా యనరే..
రామ నామ గాన సుధల తేలి ముక్తి పొందరే..
శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి..
ముత్యాల తలంబ్రాలు తీసుకు వెళ్ళండి…
నా శ్రేయోభిలాషులందరకు మరొక్క సారి “శ్రీరామ నవమి” శుభాకాంక్షలు…
– కొడాలి బేబీ జగదీష్
నడింపల్లి, బాపట్ల జిల్లా.