రాష్ట్ర అభివృద్ధి సంక్షేమరంగాలపై అలంకృత శకటాల ప్రదర్శన…


-ఆకట్టుకున్న అలంకృత శకటాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రదర్శింపబడిన అలంకృత శకటాలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు శోభను చేకూర్చాయి. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని కళ్లకు కట్టిన్నట్లుగా వివరించేవిధంగా 15 ప్రచార శకటాలను ఈస్వాతంత్య దినోత్సవ వేడుకలలో ప్రదర్శించబడ్డాయి. ఈశకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్యదినోత్సవ వేడుకలలో ప్రదర్శింపబడిన శకటాలలో ప్రధమ ఉత్తమశకటంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ (దిశ) నిలవగా, ద్వితీయ ఉత్తమశకటంగా విద్యాశాఖ నిలవగా, తృతీయ ఉత్తమశకటంగా వ్యవసాయశాఖ (రైతుభరోసా కేంద్రాలు, రైతుభరోసావివరాలు) శకటం నిలిచింది. ఈసందర్భంగా ఆయాశాఖల ఉన్నతాధికారు లైన అనురాధ, కృతికా శుక్లా, మధుసూధనా రెడ్డి, పూనం మాలకొండయ్య, అరుణ్ కుమార్ లకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మెమెంటోలను బహుకరించారు.
మహిళల రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న దిశ యాప్ పై అవగాహన కలిగించే శకట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ పోలీస్ సహాయం అందించేందుకు రూపొందించబడి “దిశయాప్ ” బాగా ప్రాచుర్యం పొందింది. ఆపదలో ఉన్న మహిళలకు ఈయాప్ వజ్రాయుధంగా నిలుస్తున్నది. డిశంబరు 2019 నుంచి 143 నేరారోపణ కేసులను విచారించగా వీటిలో 3 మరణశిక్షణలు, 14 జీవిత ఖైదు శిక్షలు వేయడం జరిగింది. మహిళలపై నేరాల కేసుల విచారణ పూర్తి చేయడానికి సగటు సమయం 2017 లో 117 రోజులు ఉండగా, 2020-21 లో 41 రోజులకు తగ్గింది. ప్రస్తుత సంవత్సరం లైంగిక నేరాలపై విచారణ రేటు ఆంధ్రప్రదేశ్ లో 90.17 శాతం ఉండగా జాతీయ సగటు రేటు 35 శాతం ఉంది. దిశ 4 స్కాచ్ అవార్డులతో పాటు జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.
విద్యతోనే వికాసం సాధ్యమని భావించిన మన ప్రభుత్వం రాష్ట్రంలో బడి ఈడు పిల్లలందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీ వెనె, జగనన్న వసతి దీవెనె, జగనన్న గోరుముద్ద వంటి పలు పధకాలను అమలు చేస్తున్న తీరును ఈశకటం రూపంలో ప్రదర్శించారు. గత ఆర్ధిక సంవత్సరం 69,19,565 మంది విద్యార్ధులు, 42,33,098 మంది తల్లులకు రూ. 6,349.64 కోట్ల మేర లబ్ది చేకూరింది. ఈవిద్యాసంవత్సరంలో 71,06,161 మంది విద్యార్ధులకు లబ్ది, తద్వారా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,673.29 కోట్ల మేర నగదు జమ చేసారు. 9- 12 తరగతుల విద్యార్ధులకు వారి కోరిక మేరకు నగదు బదులు ల్యాప్టాప్లను ఇవ్వడం జరుగుతున్నది. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిగా మనబడి-నాడునేడు, జగనన్న విద్యాకానుక కార్యక్రమాలు నిలుస్తాయి.
రైతుభరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం.. విత్తనం నుంచి విక్రయం వరకూ.. రైతే రాజు అంటూ వ్యవసాయం ఒక పండుగలా జరగాలని, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10778 రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వ్యవసాయశాఖలో వై.యస్.ఆర్. రైతు భరోసాపధకంపై రూపొందించిన శకటంలో ప్రధానంగా నవరత్నాల్లో ఒక టైన వై.యస్.ఆర్. రైతుభరోసా ద్వారా ప్రతి రైతుకుటుంబానికి సంవత్సరానికి 12500 రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల రూపాయలను పంపిణీ చేయనున్నామని ఇప్పటివరకూ 52.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 17,029.88 కోట్లు జమ చేయడం జరిగిందని వివరించడం జరిగింది.
పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏపి అమూల్ జగనన్న పాలవెల్లువ.. తద్వారా గ్రామస్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తున్న మనపల్లెలంటూ ప్రత్యేకంగా అలంకరించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో అతికీలకపాత్ర వహించే పాడి పరిశ్రమను బలో పేతం చేసేందుకు ఈపధకం ఎంతో దోహదపడుతుంది. రాష్ట్రంలో మహిళా డెయిరీ సహకార సొసైటీలను బలో పేతం చేసేందుకు మద్దతుగా రూ. 4,189.75 కోట్ల వ్యయంతో బల్క్ మిల్క్ థ్రిల్లింగ్ యూనిట్లు, ఏయంసియులు ఏర్పాటు అవుతున్నాయి.
జలవనరులశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన శకటం జలం జీవనాధారం అయితే.. పోలవరం రాష్ట్ర జీవనాథ్ అంటూ పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రదర్శించబడింది. ఈఏడాది జూన్ నాటికి ప్రాజెక్టు కోసం రూ. 17,763 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడానికి వచ్చే ఏడాది ఖరీఫ్ పంటకు గ్రావిటీ ద్వారా కాల్వల్లోకి నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి 7.2 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీటి సౌకర్యాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్రంలోని మహిళలు పిల్లల ఆరోగ్య సంరక్షణకు, మహిళల భద్రతకై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వినూత్న పధకాలను తెలిపే శకటాన్ని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రదర్శించింది.
విద్యాశాఖ ఆధ్వర్యంలో మరో రెండు శకటాలను ప్రదర్శించారు. వాటిలో జగనన్న విద్యాకానుక, జగనన్న సుపరిపాలన- ఉన్నత విద్యకు దీవెనె అంటూ విద్యార్ధుల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈశకటం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని నిరు పేద విద్యార్ధులను ఉన్నత విద్యాపరంగా మరింతగా ముందుకు తీసుకెళ్లే పధకాలలో జగనన్న విద్యాదీ వెన పధకం ఒకటి. మరొకటి జగనన్న వసతి దీవెనె.
దేశానికే తలమానికం వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ.. పేదవారికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందజేసే లక్ష్యంతో నాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డా. వైయస్. రాజశేఖర రెడ్డి 2007లో ప్రవేశ పెట్టిన ఆరోగ్య పధకం లక్షలాదిమంది నిరు పేదలకు ఆరోగ్యప్రదాయిగా నిలవడమే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచింది. అటువంటి పధకాన్ని మరింత మెరుగుపరిచి క్రొత్త విధానాలతో నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. క్రొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 11.77 లక్షలకు పైగా రోగులకు రూ. 4,224 కోట్లు ఖర్చు చేయబడింది.
నాడు-నేడుతో ఆసుపత్రుల ఆధునికీకరణ.. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటంలో రాష్ట్రంలో రూ. 8 వేల కోట్ల వ్యయంతో నూతనంగా 16 వైద్య, నర్సింగ్ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసిన అంశాన్ని చూపారు. ప్ర భుత్వాసుపత్రుల రూపు రేఖలు సమూలంగా మార్చి పేదవాడికి ఆధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నాడు-నేడుతో ఆసుపత్రుల ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కరోనానియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ.. యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్న కరోనా మహమ్మారిపై విజయంసాధించే ప్రయత్నంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ఇందుకు సంబంధించిన శకట ప్రదర్శనలో దేశంలో కోవిడ్ పరీక్షల్లో ప్రధమస్థానంసాధించిన విషయాన్ని కోవిడ్ వ్యాక్సినేషన్లో రికార్డు, మూడవ వేవ్ ను సమర్ధ వంతంగా ఎదుర్కునేందుకు సన్నద్ధతను తెలిపే అంశాలు ప్రదర్శించబడ్డాయి.
గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు శకటాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలో రెండు దశల్లో రూ. 50,944 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల పక్కా గృహాలను 2023 జూన్ నాటికి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటివరకూ సుమారు 10.01 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభించింది. అవి ఇళ్లు కాదు.. ఊళ్లు.. అనే విధంగా ఈలేఅవుట్ లను గ్రామాలు/పట్టణాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రూ. 34,109 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతున్నది.
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) ద్వారా నవరత్నాలు వంటి ప్రజా సంక్షేమ పథకాలతో లక్షలాది అక్కా చెల్లెమ్మలను లక్షాధికారులుగా చేసే వివిధ సంక్షేమ పధకాలను తెలియజేసే విధంగా ఈశకటం ప్రదర్శించబడింది. వై.యస్.ఆర్. పెన్షన్ కానుక-వై.యస్.ఆర్. ఆసరా శకటం అందరినీ ఆకర్షించింది. పెన్షన్లను దశలవారీగా మూడు వేలరూపాయలకు పెంచడం, అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించడం, గ్రామవాలంటీర్లు వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే వచ్చి పెన్షన్ ఇవ్వడం, అక్కాచెల్లెళ్లకు వడ్డీ లేనిఋణాలు, వై.యస్.ఆర్. చేయూత వంటి వివరాలతో శకటాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.
మౌలిక సదుపాయాల కల్పనతోనే సత్వర పారిశ్రామిక అభివృద్ది.. “మీరెదగండి.. మేమూ ఎదుగుతాం ”అనే నినాదంతో పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వకమైన పారిశ్రామిక విధానం 2020-23ను ప్రభుత్వం తీసుకువచ్చింది. పెట్టుబడులను
ఆకర్షణలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉంది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశకటం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని తెలియజేస్తుంది.
అటవీశాఖ శకటం పై వృక్షో రక్షిత రక్షితాః ….. వనమహోత్సవం-2021…జగనన్న పచ్చతోరణం.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న పచ్చతోరణం. రాష్ట్రంలో 17 వేల కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లకిరువైపులా రోడ్ల మధ్యలో మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 2020-21 (ఐయయఆర్-2019) కి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటవీ అభివృద్ధినందు వరుసగా దేశంలోనే రెండవ స్థానం పొందింది..

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *