-ఉద్యోగికి అదనపు వేతనం.. యజమానికి ఆర్థిక ప్రోత్సాహం
-ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కమిషనర్ కె. వెంకటేశ్వర్లు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి *వికసిత భారత్ రోజ్ గార్ యోజన” (పిఎంవి బిఆర్ వై) కింద నమోదు చేసినట్లు అయితే ఉద్యోగికి అదనపు వేతనం, యజమానికి ఆర్థిక ప్రోత్సాహం మొత్తం లభిస్తుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రాంతీయ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.
బుధవారం ఉదయం రాజమహేంద్రవరం లోని పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో పి.ఎం.వి.బి.ఆర్.వైపథక అమలుపై క్రెడాయ్ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎఫ్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ పథకం 2025 ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ పథకం ద్వారా తొలిసారిగా ఉద్యోగం పొందిన వ్యక్తి ఖాతాలో ఒక నెల ఈపీఎఫ్ వేతనాన్ని (బేసిక్+డి ఎ) ప్రభుత్వం రెండు విడతల్లో జమ చేస్తుందని చెప్పారు. ఆ మొత్తం గరిష్టంగా పదిహేను వేల రూపాయల వరకు పొందవచ్చని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా మొదటిసారి ఉద్యోగంలో చేరే దాదాపు 1.92 కోట్ల మందికి ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందన్నారు.
అదే సమయంలో అటు ఉద్యోగితో పాటు… ఇటు యజమానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. కనీసం ఆరు నెలల నిరంతర ఉపాధి ప్రాతిపదికన నియమించుకున్న ప్రతి అదనపు ఉద్యోగి కోసం యాజమాన్యాలకు నెలకు వెయ్యి రూపాయల నుంచి 3000 రూపాయల వరకు రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని చెప్పారు.
ఉద్యోగులకు ప్రత్యక్ష నగదు బదిలీ (డి బి టి) ద్వారా, యాజమాన్యాలకు వారి పాన్ అనుసంధానిత ఖాతాల ద్వారా చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.
2025 ఆగస్టు ఒకటి నుంచి 2027 జులై 31 మధ్యకాలంలో కల్పించిన ఉద్యోగాలకు ఈ పథక ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు. 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఇందు నిమిత్తం 99,446 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.
కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఈ పథకాన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న యజమాని అమలు చేయాలని వెంకటేశ్వర్లు చెప్పారు. రాజమండ్రి ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయ పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 12 వేల కంపెనీలు నమోదై ఉన్నాయని, వీరంతా తప్పనిసరిగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పారు. ఉద్యోగుల పి ఎఫ్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని, జరిమానాలు విధిస్తామని ఆయన చెప్పారు. నిర్మాణ రంగంలో ఎక్కువమంది పనిచేస్తున్నారని వారంతా పథక పరిధిలో వచ్చేలా క్రెడాయ్ చర్యలు తీసుకోవాలని సూచించారు.
భవిష్య నిధి సంస్థలో సభ్యత్వం తీసుకుని కనీసం ఒక సంవత్సరం సర్వీస్ కలిగిన వారికి ప్రమాద బీమా రెండున్నర లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు లభిస్తుందని చెప్పారు.
ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల సంఘాలు, రైస్ అసోసియేషన్లు, ఆక్వా, హోటల్, చేనేత కార్మికుల సంఘాలతో సమావేశాలు నిర్వహించామని, భవిష్యత్తులో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ పీఎఫ్ కమిషనర్లు యు. శ్రీనివాసరావు, రాధానాథ్ పట్నాయక్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కృష్ణ, కార్మిక శాఖ అధికారులు, క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News