రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త డా. సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి వేడుకలు శనివారం ఉదయం బొమ్మూరు కలెక్టరేట్‌లోజిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, తదితరులు సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ “1909 ఆగస్టు 16న శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామంలో జన్మించిన డా. సర్దార్ గౌతు లచ్చన్న గారు చిన్న వయస్సులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక స్వాతంత్ర్య పోరాటాల్లో చురుకుగా పాల్గొని, బెర్హంపూర్, రాజమండ్రి జైళ్లలో కఠినమైన శిక్షలను అనుభవించా రన్నారు. ఆయన జీవితాంతం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినట్లు పేర్కొన్నారు. 1940లో పలాసలో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ, 1948లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సదస్సు వంటి చారిత్రాత్మక సంఘటనల్లో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకం అన్నారు. 1957లో హైకోర్టు OBC జాబితాను కొట్టివేసినప్పుడు దాని పునరుద్ధరణ కోసం ఆయన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపారన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి, గాంధేయవాదిగా సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ఎప్పటికీ నిలిచిపోతుందనీ, అటువంటి మహానుభావుని జయంతి మనందరికీ స్ఫూర్తి, గర్వకారణం” అని అన్నారు.
జిల్లా బిసి సంక్షేమ అధికారి బి. శశాంక మాట్లాడుతూ “వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న గారు చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయం. ఆయన త్యాగాలు నేటి తరానికి ఆదర్శం” అన్నారు.
జిల్లా డి.ఆర్వో టి. సీతారామ మూర్తి మాట్లాడుతూ, “సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవితం, కృషి మనందరికీ దిశానిర్దేశం. ఆయన చూపిన మార్గంలో నడుస్తే సమానత్వ సమాజం సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డి ఆర్వో టి సీతారామ మూర్తి, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక , సహాయ బిసి సంక్షేమ అధికారులు ముత్యాల సుబ్బరాజు, టీవీ ప్రసాద్, వసతి గృహాల సంక్షేమ అధికారులు, కలెక్టరేట్ , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News