-యూరియా వృథా కాకుండా నానో యూరియా వినియోగించాలి – వ్యవసాయ అధికారి విజ్ఞప్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వాతావరణ హెచ్చరికలు కొనసాగుతున్న నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పంటలకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పంటల రక్షణ కోసం రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం అత్యవసరమని ఆమె సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు రైతులకు విజ్ఞప్తి చేస్తూ, రసాయనిక ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా యూరియాను వర్షకాలంలో పొలాల్లో చల్లడం వలన, అది నీటిలో కరిగిపోయి లేదా ఆవిరై పోయి వృథా అవుతుందని వివరించారు. సాధారణ యూరియాలో కేవలం 30% మాత్రమే పంటలకు ఉపయోగపడుతుందని, మిగతా 70% వృథా అవుతుందని రైతులు గమనించాలన్నారు.
వర్షం తగ్గిన తరువాత ఘన రూపంలోని యూరియా బదులుగా నానో యూరియాను వినియోగించడం ద్వారా ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. ప్రతి ఎకరాకు 500 మిల్లీ లీటర్ల (అర లీటర్) నానో యూరియాను పిచికారి చేయడం ద్వారా ఆకుల ద్వారా పంటకు చేరి 90% వరకు ప్రయోజనం కలిగిస్తుందని వివరించారు. దీని వలన పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు. అలాగే పొలాల్లో అధిక నీరు నిల్వ ఉండే పరిస్థితుల్లో డ్రైనేజీ ద్వారా బయటకు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేయాలని రైతులకు సూచించారు. వర్షం తగ్గే వరకు రసాయనిక ఎరువుల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని, కలెక్టర్ సూచనల మేరకు రైతులు వ్యవహరిస్తే పంటలను సురక్షితంగా కాపాడు కోవచ్చని మాధవరావు తెలిపారు.
Prajavartha Online Telugu News