అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతంగా వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 8 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటిమట్టం 47.4 అడుగులు ఉందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 8 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 8.28 లక్షల క్యూసెక్కులు ఉందని, రేపటిలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మండల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.67 లక్షల క్యూసెక్కులు ఉందని, మొదటి హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. సహాయక చర్యలకు SDRF బృందాలు జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
గోదావరి,కృష్ణా నదుల వరద ప్రవాహం వివిధ ప్రాజెక్టులలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు.
Prajavartha Online Telugu News