రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి కీర్తి చేకూరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కీర్తి చేకూరి నీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి ఐ ఐ టి మద్రాస్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆమె మూడు సార్లు యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, మొదటి సారి 440 ర్యాంక్ , రెండోసారి 512 ర్యాంక్, మూడోసారి అత్యుత్తమ 14వ ర్యాంక్‌తో 2016లో IASగా నియామకం అయ్యారు. వృత్తిపరమైన క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం కలిగిన అధికారిణిగా పేరు పొందిన ఆమె, తొలిసారిగా చిత్తూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్, తదుపరి మదనపల్లెలో సబ్ కలెక్టర్, ఉమ్మడి తూర్పు గోదావరిలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్‌గా, ప్రస్తుతం “ఏపీ ట్రాన్స్ కో” లో జాయింట్ డైరెక్టర్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిబద్ధత, క్రమశిక్షణ, పారదర్శకతతో విధులు నిర్వర్తించే అధికారిణిగా మంచి పేరు సంపాదించుకున్న కీర్తి చేకూరి సెప్టెంబర్ 13 వ తేదీ శనివారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Prajavartha Online Telugu News