-ప్రీ ఆడిట్ జరపకుండా అర్జిల పరిష్కార విధానం
-క్షేత్ర స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు
-సూపర్ జీ ఎస్ టి పోస్టర్ ఆవిష్కరణ
-కలెక్టర్ కీర్తి చేకూరి, జేసి వై మేఘ స్వరూప్ తదితరులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్జీల పరిష్కారం కోసం వొచ్చే అర్జీదారులతో నేరుగా మాట్లాడి మాత్రమే , వాటిని ముగింపు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు ఆదేశించారు.
సోమవారం బొమ్మూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక–గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, డి.ఆర్.ఓ టి. సీతారామ మూర్తి, ఇతర అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, కొంత మంది అధికారులు అర్జీదారులను సంప్రదించకుండానే అర్జీలను పరిష్కారం చేయడం గమనించామని, ఆమేరకు నివేదికలు ఇవ్వడం జరిగిందనీ, ఈ విధానం పూర్తిగా తప్పని ఆమె స్పష్టం చేశారు. అర్జీలు స్వీకరించడం, వాటిని పరిష్కారం చూపడం తో సరికాదని, ప్రజలకు చూపిన పరిష్కారం పట్ల వారు సంతృప్తి చెందడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ సూచించారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికిన వాటి వివరాలు ఆధారంగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి సంతృప్తి స్థాయి పై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
గ్రీవెన్స్ కార్యక్రమం అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, మండల లేదా సచివాలయ స్థాయిలోనే పరిష్కరించాల్సిన సమస్యలు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమానికి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు వంటి సాధారణ సమస్యలు స్థానిక స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో అర్జీదారులతో నేరుగా మాట్లాడి, సమస్యను పరిష్కరించగలిగితే వెంటనే ముగింపు చేసి, వారితో ఆ విషయం తెలియ చేయడం జరగాలన్నారు. పరిష్కరించలేని సందర్భంలో ఏ కారణం చేత పరిష్కారం సాధ్యం కాలేదో అర్జీదారునికి స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత అధికారులదే అని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం సమయానికి జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించేలా ప్రతి శాఖాధికారి వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రజలకు సంతృప్తి కలిగించే విధంగా వ్యవహరించాలని ఆమె అధికారులకు సూచించారు.
సూపర్ జీ ఎస్ టి పోస్టర్ ఆవిష్కరణ :
జిల్లా కార్యాలయాలలో జిఎస్టి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి, సంస్కరణల తరువాత వస్తువులు, సేవల ధరల్లో వచ్చిన తగ్గింపును ప్రజలకు తెలియజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిఎస్టి తగ్గింపు వల్ల కలిగే మేలును ప్రజలకు ఇంటి ఇంటికీ వెళ్లి వివరించడం ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నిడదవోలు, కోవూరు మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీవోలు త్రాగునీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జ్వరాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో బోరు నీటిని కూడా పరీక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా క్షేత్ర స్థాయిలో సిబ్బంది వ్యక్తిగత బాధ్యత వహించాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి:
అక్టోబర్ 1న పింఛన్లు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేయాలని, అందరినీ ఒకే చోటకు పిలిచి ఇవ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ పంట నమోదు:
జిల్లాలో ఈ–పంట నమోదు ఇప్పటికే 90 శాతం పూర్తయిందని, మిగిలిన వివరాల నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈరోజు అర్జీలు స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్, డీ ఆర్వో టి సీతారామ మూర్తి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు ఎమ్ ఆర్ ఆర్ ప్రేమ్ కుమార్, ఎస్. భాగ్య లక్ష్మీ, వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ సుధాకర్, డీఎల్డివో ఏ స్లీవా రెడ్డి, పి వీణా దేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News