-జి టి జి హెచ్ లో క్యాన్సర్ కి చికిత్స, 10 కేజీల భారీ ట్యూమర్ విజయవంతంగా తొలగింపు
-తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చు – కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రజలు భయపడకుండా క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స కోసం ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్ (GTGH), రాజమండ్రి లో అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.
“ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు క్యాన్సర్ చికిత్సకు పూర్తి సదుపాయాలు ఉన్నాయి. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా జయించడం సాధ్యం. ప్రజల్లో అవగాహన పెంచి, ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అలవాటు పెంపొందించుకోవాలి” అని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు.
గత ఏడాది కాలంలో 150 మందికి పైగా రోగులకు కీమోథెరపీ చికిత్స విజయవంతంగా అందించబడింది. అదనంగా 300 మందికి పైగా రోగులు మందులు, కౌన్సిలింగ్ ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సర్జికల్ అంకాలజీ (Surgical Oncology), కీమోథెరపీ (Chemotherapy) మరియు ఇతర అనుబంధ సేవలు GTGHలో అందుబాటులో ఉన్నాయి.
“ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్, మరియు తగిన వైద్య సేవలు అందిస్తున్నాం. రోగులకు మానసిక ధైర్యం కల్పిస్తూ సమగ్ర వైద్య సహాయం అందించడం మా లక్ష్యం. రాజమండ్రి ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ.పి వార్డు నం.45 లో నమోదు చేసుకొని సేవలు పొందవచ్చు” అని డా. డి. సమీరాజా (Medical Oncologist) మరియు డా. స్పందన (Radiation Oncologist) తెలిపారు.
ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమండ్రి – ఓ.పి వార్డు నం.45 లో పేర్లు నమోదు చేసుకున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, తదుపరి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. “మన ఆరోగ్యం – మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే భరోసా” కల్పించడం జరుగుతోందని వెల్లడించారు. క్యాన్సర్‌ను తొందరగా గుర్తించండి – జీవితం కాపాడుకోండి సాధ్యం అవుతుందని సూచించారు.
ఈ 7 హెచ్చరిక సంకేతాలను గమనించండి: గాయం ఎక్కువకాలం నయం కాకపోవడం, మూత్రం లేదా విసర్జనలో మార్పులు, అసాధారణ రక్తస్రావం, ముద్దలు లేదా గడ్డలు ఏర్పడటం, మింగడం లేదా జీర్ణం చేయడంలో ఇబ్బంది , చర్మంలో మచ్చలు లేదా రంగు మార్పులు , నిరంతర దగ్గు లేదా గళం మార్పు
ఈ లక్షణాలు గమనిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే GTGH క్యాన్సర్ విభాగాన్ని సంప్రదించండి అని వైద్యులు సూచించారు.
భారీ 10 కేజీల ట్యూమర్ విజయవంతంగా తొలగింపు
డా. సమీరా రాజా నేతృత్వంలో వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స
రాజమండ్రి ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్‌లో బుధవారం (22.10.2025) న డా. సమీరా రాజా (Medical Oncologist) నేతృత్వంలోని వైద్య బృందం ఒక మహిళా రోగిపై అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు . ఈ ఆపరేషన్‌లో రోగి పొత్తికడుపులో ఉన్న సుమారు 10 కిలోల బరువైన ట్యూమర్ (Complex Ovarian Cyst) ను తొలగించారు. డా. సమీరాజి తెలిపిన ప్రకారం,
కొత్త పేటకు చెందిన 78 సంవత్సరాల మహిళకు ఓవరీ ట్యూమర్ సమస్య ఉండగా, రాజమండ్రి ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్‌లో బుధవారం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, రోగి ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్స ద్వారా GTGHలో అత్యాధునిక శస్త్రచికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే విషయం మరోసారి రుజువైందన్నారు.
డా సమీరా రాజా వైద్య బృందాన్ని పలువురు అభినందించడం జరిగింది.
Prajavartha Online Telugu News