-విత్తనం నుండి విక్రయం వరకు ప్రభుత్వానిదే బాధ్యత- రైతాంగానికి మంత్రి కందుల దుర్గేష్ భరోసా
-కాపవరం గ్రామంలో విస్తృత పర్యటన..”రైతన్నా మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్
-నిడదవోలు నియోజకవర్గంలో 19,315 మంది రైతుల నుండి ధాన్యం సేకరించి రూ. 38.54 కోట్ల నిధుల జమ చేశామని వెల్లడి
-కాపవరం అభివృద్ధికి రూ. 1.94 కోట్లు వ్యయం చేశామని స్పష్టం..పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్
-ఇంటింటికీ వెళ్లి రైతులతో నేరుగా ముఖాముఖి.. అన్నదాతల సమస్యలు,సాగు అవసరాలు, ఎరువుల లభ్యతపై ఆరా..కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
-కూటమి ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేశామని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-జల్ జీవన్ మిషన్ ద్వారా త్వరలోనే ఇంటింటికీ గోదావరి శుద్ధి జలాల పంపిణీ
-వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఐదు సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ ప్రకటన
-మార్కెట్ కమిటీకి స్వంత భవనం ఏర్పాటుకు, రైతు బజారు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల లక్ష్యమని, విత్తనం నుండి విక్రయం వరకు పండించిన ప్రతి గింజను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాపవరం గ్రామంలో మంత్రి దుర్గేష్ విస్తృతంగా పర్యటించారు.రైతుల ఇంటింటి సందర్శన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మార్చి 16,17,18 మరియు 23,24,25 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. రైతాంగం సమస్యలు, సాగు అవసరాలు, ఎరువుల లభ్యత తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ నిధులు అందిన తీరును, కలిగిన లబ్ధిని రైతుల ఫోన్లలోనే మెసేజ్ ద్వారా చూపిస్తూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ క్రమంలో రైతులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లిన మంత్రి దుర్గేష్ కు స్థానిక రైతాంగం, ప్రజానీకం పూలు చల్లి స్వాగతం పలకడం విశేషం.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం:
కాపవరం పర్యటనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ పలు కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైతుల విజ్ఞప్తి మేరకు సుమారు 600 ఎకరాల ఆయకట్టుకు వెళ్లేందుకు వీలుగా రూ. 35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పుంత రోడ్డు పనులను మంత్రి దుర్గేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పశుసంవర్థక రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ‘పల్లె పండుగ’ పథకం కింద నిర్మించిన గోకులం షెడ్డును ప్రారంభించారు. అనంతరం మార్టేరు-ప్రక్కిలంక ప్రధాన రోడ్డు పనులను పరిశీలించి, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో కొత్త రోడ్లు వేయకపోగా కనీసం ఉన్న రోడ్లకు తట్టెడు మట్టి వేసి మరమ్మత్తులు చేసిన పాపాన పోలేదని ఘాటుగా విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని మంత్రి దుర్గేష్ వివరించారు.
కాపవరం గ్రామానికి కూటమి ప్రభుత్వం కేటాయించిన నిధులు,చేసిన అభివృద్ధి కార్యక్రమాలు:
కాపవరం గ్రామ అభివృద్ధి కోసం మొత్తం రూ. 1,94,50,000 ఖర్చు చేశామని మంత్రి దుర్గేష్ గణాంకాలను వెల్లడించారు. ఇందులో పల్లె పండుగ 1 కింద ఒక పనికి రూ.6 లక్షలు, పల్లె పండుగ 2 ద్వారా 4 పనులకు రూ. 66 లక్షలు కేటాయించి రోడ్లు వేశామన్నారు. పంచాయతీ నిధులు రూ. 21.55 లక్షలు, డిస్ట్రిక్ మినరల్ ఫండ్ నుండి రూ.20 లక్షలు, ఎంపీపీ నిధులు రూ.1.08 లక్షలు, గోకులం షెడ్డుకు రూ.2 లక్షలు, నాబార్డ్ నిధులు రూ.1.70 లక్షలు, కాపవరంలో జల్ జీవన్ మిషన్ పనులకు రూ. 75 లక్షలు కేటాయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో జల్ జీవన్ మిషన్ ద్వారా త్వరలోనే గోదావరి నుండి శుద్ధి చేసిన జలాలను కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సంబంధిత కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెరవలి వేదికగా ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు పాడైన బ్రిడ్జిని బాగు చేసేందుకు ఇప్పటికే అంచనాలు రూపొందించామని, త్వరలోనే నిధులు కేటాయించి పనులు చేపడతామని సానుకూలంగా స్పందించారు.
వ్యవసాయ పంచసూత్రాలు – స్మార్ట్ ఫార్మింగ్:
ఈ సందర్భంగా కాపవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించారు. గతంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ నేడు ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే, కొన్ని చోట్ల 3-4 గంటల్లోనే నగదు జమ అవుతోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రూ.1600 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలు చెల్లించిందన్నారు. గత ప్రభుత్వం రైతును దగా చేస్తే తాము రైతాంగానికి న్యాయం చేస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఐదు సూత్రాల ప్రణాళికను అనుసరిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. అందులో భాగంగా నీటి భద్రత (సాగునీటి సరఫరా), డిమాండ్ ఆధారిత పంటలు (లాభదాయక పంటల ఎంపిక),అగ్రిటెక్ (ఆధునిక సాంకేతికత వినియోగం), ఫుడ్ ప్రాసెసింగ్ (పంటకు అదనపు విలువ), ప్రభుత్వ పూర్తి మద్దతు (విత్తనం నుండి విక్రయం వరకు) ను వివరించారు. “కష్టపడి చేసే వ్యవసాయం కంటే స్మార్ట్ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి. డ్రోన్ల వినియోగానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. రైతు బజార్ల ఏర్పాటు ద్వారా దళారుల ప్రమేయం లేకుండా పంట అమ్ముకునే సదుపాయం కల్పిస్తాం” అని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు కుటుంబాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మార్కెట్ కమిటీకి స్వంత భవనం ఏర్పాటుకు, రైతు బజారు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో చర్చించామని త్వరలోనే ఆ కల సాకారమవుతుందని హామీ ఇచ్చారు. నిడదవోలు నియోజకవర్గ వ్యాప్తంగా 19,315 మంది రైతులకు రూ. 38.54 కోట్లు జమ చేశామని, ఒక్క కాపవరం గ్రామంలోనే మూడు సీజన్లలో రూ. 103 లక్షలు రైతుల ఖాతాల్లోకి చేరాయని ఆయన వివరించారు. ఈ గణాంకాలే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.రైతు పండించే చివరి గింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వానిదే అని రైతులకు భరోసా ఇచ్చారు. రైతు ఆదాయం పెంపు, పెట్టుబడి వ్యయాల తగ్గింపు, పంటలకు గిట్టుబాటు ధర, ప్రకృతి విపత్తుల్లో రక్షణ, మార్కెట్ స్థిరీకరణ, పొలంబడి ద్వారా శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. గత ప్రభుత్వం పాపాలు అధిగమించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. నూటికి నూరు శాతం రైతన్న ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామన్నారు.అందుబాటు లోన్లు, పంట బీమా, నీటి వనరుల మెరుగుదల, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, రైతు సేవా కేంద్రాల బలోపేతం వంటి చర్యలు.. రైతు కుటుంబాల అభివృద్ధి వైపు స్పష్టమైన అడుగులని పేర్కొన్నారు.రాష్ట్రంలో రైతులు స్వయం సమృద్ధి సాధించే పరిస్థితులను క్రమబద్ధంగా తీసుకువస్తున్నట్లు చెప్పారు.రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా రైతుకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నామని చెబుతూ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పేద ప్రజల పక్షాన నిలబడటానికే ఉన్నారన్నారు.
చివరగా, “మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పండి, సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రజలకు సేవ చేయడానికే మేము రాజకీయాల్లో ఉన్నాం” అని చెబుతూ “జై రైతన్నా” నినాదంతో మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, స్థానిక కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News