-న్యాయ మౌలిక వసతులు ప్రజల విశ్వాసానికి ప్రతీకలు కావాలి
-ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ శనివారం రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్.వి. ప్రసాద్, పలువుర న్యాయ మూర్తులు, న్యాయ వాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, ఎస్పీ డి నరసింహ కిషోర్, మునిసిపల్ కమిషనర్ రాహుల్ మీనా, తదితరులు పాల్గొన్నారు.
న్యాయ మౌలిక వసతులు కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించిన భవనాలు మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలకు, న్యాయ వ్యవస్థ నిబద్ధతకు ప్రతీకలని జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి నప్పుడే న్యాయం సమాజంలోని ప్రతి వర్గానికీ చేరుతుందని అన్నారు.
రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి ప్రాంతాల సాంస్కృతిక, సాహిత్య, న్యాయ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ, ఈ నేల నుంచి అనేక మంది ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాహితీవేత్తలు, స్వాతంత్ర్య సమరయోధులు వెలుగులోకి వచ్చారని కొనియాడారు.
న్యాయ వ్యవస్థలో సాంకేతికత ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని, డిజిటలైజేషన్ ఇప్పుడు అనివార్యమైందని ఆమె అన్నారు. కోవిడ్ కాలంలో కూడా భారత న్యాయస్థానాలు ప్రజలకు అందుబాటులో ఉండటం దేశ న్యాయ వ్యవస్థ గొప్పతనమని పేర్కొన్నారు.
అయితే కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాంకేతికతను మన ప్రయోజనానికి ఉపయోగించు కోవాలే గానీ, స్వతంత్ర ఆలోచనను కోల్పోవద్దని అన్నారు. చాట్‌జీపీటీ వంటి సాధనాలు మానవ ఆలోచనకు ప్రత్యామ్నాయం కావని స్పష్టం చేశారు.
కొత్త కోర్టు భవన సముదాయానికి నిరంతర నిర్వహణ, అవసరమై నప్పుడు ఆధునీకరణ ఉండాలని, దీనిపై పరిపాలన దృష్టి సారించాలని సూచించారు. మధ్యవర్తిత్వం (మేడియేషన్) ప్రాధాన్యాన్ని వివరించిన ఆమె, మేడియేషన్‌ను కేవలం కుటుంబ వివాదాలు లేదా మోటార్ ప్రమాద కేసులకు మాత్రమే పరిమితం చేయరాదన్నారు. వివాదాలను తీర్పుతో ముగించడమే కాకుండా, పరస్పర అవగాహనతో పరిష్కరించడమే నిజమైన విజయమని చెప్పారు. న్యాయవాదులు, న్యాయాధికారులు మేడియేషన్‌ను మరింత ప్రోత్సహించాలని ఆమె కోరారు. కోర్టులు కేవలం వివాదాలు తీర్చే స్థలాలుగా కాకుండా, పరస్పర విభేదాలు తొలగి సఖ్యత నెలకొనే వేదికలుగా మారాలని ఆకాంక్షించారు.
విచారణలు వేగంగా పూర్తయ్యేందుకు సాక్షుల హాజరు తదితర అంశాల్లో పోలీసు శాఖ పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఈ భవన నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు అందరినీ అభినందించిన ఆమె, ఈ నూతన కోర్టు భవనం సత్యం, న్యాయం, ధర్మానికి మార్గదర్శకంగా నిలిచి న్యాయ సేవలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బార్ – బెంచ్ సమన్వయంతోనే న్యాయ వ్యవస్థ బలోపేతం
– జస్టిస్ బట్టు దేవానంద్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే బార్ మరియు బెంచ్ మధ్య పరస్పర గౌరవం, సహకారం, సమన్వయం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరంలో నూతన 10 కోర్టుల భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభం కావడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకు వచ్చిందన్నారు. బార్ మరియు బెంచ్‌ను “న్యాయ రథానికి రెండు చక్రాలు”గా అభివర్ణిస్తూ, రెండూ సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు సమర్థవంతమైన న్యాయం అందుతుందని తెలిపారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు వేర్వేరు బాధ్యతలు నిర్వహించినప్పటికీ, సామాన్య ప్రజలకు న్యాయం అందించడం అనే లక్ష్యం ఒక్కటేనన్నారు. “బార్ అనేది బెంచ్‌కు తల్లి వంటిది” అని పేర్కొంటూ, న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేయాలని సూచించారు. వృత్తిపరమైన ఒత్తిడులు, మౌలిక వసతుల సమస్యలు ఉన్నప్పటికీ పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని అన్నారు. ఈ నూతన కోర్టు సముదాయం తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, సులభంగా న్యాయ సేవలు అందించడంలో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వహణలో కృషి చేసిన ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి గంధం సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.వి.ఎల్. ప్రసాద్, కోర్టు సిబ్బంది తదితరులను అభినందించారు. కోర్టు భవన నిర్మాణానికి 14 సంవత్సరాలు పట్టడం సరైన విషయం కాదని పేర్కొంటూ, కోర్టులకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, సదుపాయాలు కల్పించడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
న్యాయ మౌలిక వసతులు న్యాయపాలన పట్ల నిబద్ధతకు ప్రతీకలు
– ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి గంధం సునీత
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి గంధం సునీత శనివారం రాజమహేంద్రవరంలో ప్రారంభమైన నూతన 10 కోర్టుల భవన సముదాయం జిల్లా న్యాయ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులకు స్వాగతం పలుకుతూ ఆమె ప్రసంగించారు. అఖండ గోదావరి తీరాన వెలసిన రాజమహేంద్రవరం చారిత్రక, సాంస్కృతిక, న్యాయ వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం తూర్పుగోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పోలవరం రెవెన్యూ జిల్లాలతో కూడి ఉందని తెలిపారు. రాజమహేంద్రవరంలో జిల్లా కోర్టు 1802లో స్థాపించబడిందని, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో ఏర్పాటైన తొలి న్యాయ సంస్థల్లో ఇదొకటని వివరించారు.
1802 నుంచి 1809 వరకు శ్రీ ఎల్. స్కిన్నర్ తొలి జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా పనిచేశారని తెలిపారు. భారత తొలి ప్రధాన న్యాయమూర్తుల్లో ఒకరైన కోకా సుబ్బారావు రాజమహేంద్రవరం వాసి అని గుర్తుచేశారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు రాజమండ్రిలో న్యాయవాదిగా పనిచేశారని పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త గురజాడ అప్పారావు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్లకు కూడా ఈ ప్రాంతంతో అనుబంధం ఉందన్నారు.
ఆధునిక సౌకర్యాలతో కోర్టు సముదాయం
జిల్లాలో ప్రస్తుతం 65 కోర్టులు ఉండగా, మొత్తం 87,922 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాజమహేంద్రవరంలో 18 కోర్టులు ఉండి 23,173 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మరో ఐదు కోర్టులకు ఇటీవల అనుమతులు లభించాయని వెల్లడించారు. భవన నిర్మాణ చరిత్రను వివరిస్తూ, 2008లో రూ.4.60 కోట్ల వ్యయంతో నాలుగు కోర్టుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయని తెలిపారు. అనంతరం సవరణ అనుమతులు మంజూరు కాగా, 2012లో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి. లోకూర్ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.
రాజమండ్రి బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు జీ ప్లస్ ఫోర్ నిర్మాణానికి అనుమతులు లభించాయని, నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు ఆలస్యమైనప్పటికీ 2019లో రూ.36.85 కోట్ల పరిపాలన అనుమతులు లభించిన తరువాత పనులు పునః ప్రారంభ మయ్యాయని తెలిపారు. ఈ సముదాయంలో బలహీన సాక్షుల వాంగ్మూల కేంద్రం, మేడియేషన్ కేంద్రం, కౌన్సెలింగ్ కేంద్రం, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు, రికార్డు గదులు, సాక్షుల నిరీక్షణ మందిరాలు, న్యాయమూర్తుల విశ్రాంతి గదులు, క్రెచ్ సదుపాయాలు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పాత కోర్టుల తరలింపుకు ప్రతిపాదనలు
పాత కోర్టు భవనాన్ని కూల్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, ప్రస్తుతం ఉన్న ఎనిమిది సివిల్ జడ్జి కోర్టులు, ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ/ఎస్టీ కోర్టును ఈ కొత్త భవన సముదాయానికి తరలించే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మరియు ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, ఈ నూతన కోర్టు సముదాయం న్యాయం కోరే ప్రతి ఒక్కరికీ ఆశాకిరణంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నూతన మౌలిక వసతులు న్యాయ సేవలను మరింత బలోపేతం చేస్తాయి
– జస్టిస్ ఆర్. రఘునందన్ రావు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ . రఘునందన్ రావు మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాతో తనకు వ్యక్తిగత, చారిత్రక అనుబంధం ఉందని పేర్కొన్నారు. తన పూర్వీకులు కడియం ప్రాంతానికి చెందినవారని, అక్కడ నర్సరీ ఉద్యమానికి ఆద్యులుగా నిలిచారని గుర్తుచేశారు.
రాజమహేంద్రవరంలో నూతన 10 కోర్టుల భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దశాబ్దాల క్రితమే తమ కుటుంబం కడియం ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పటికీ, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంతో అనుబంధం కొనసాగుతూనే ఉందన్నారు. నూతన కోర్టు భవనం ద్వారా ఏర్పడిన ఆధునిక మౌలిక వసతులపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన, ఈ సముదాయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలు న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో కీలకంగా మారతాయని చెప్పారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే ప్రజలకు ఈ మౌలిక వసతులు మరింత ఉపయోగకరంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాన్య ప్రజలకు కోర్టు సముదాయం న్యాయ దేవాలయం
: జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో ప్రారంభమైన నూతన 10 కోర్టుల భవన సముదాయం సామాన్య ప్రజలకు న్యాయ దేవాలయంలా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, బాధలను తీసుకువచ్చే ఈ ప్రాంగణంలో న్యాయం అందుతుందని అన్నారు. తాను రాజమహేంద్రవరం సమీపంలోని డౌలేశ్వరం ప్రాంతంలో జన్మించానని, జీఎస్‌కే లా కళాశాలలో న్యాయ విద్య అభ్యసించానని తెలిపారు. కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన సమయంలో అప్పీలు, బెయిల్ కేసుల కోసం తరచూ రాజమహేంద్రవరం కోర్టులకు వచ్చేవాడినని గుర్తుచేశారు. ఈ ప్రాంతంతో తనకు వ్యక్తిగత, వృత్తిపరమైన, కుటుంబ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి ప్రాంతానికి ప్రత్యేకమైన ఆత్మీయత, సాంస్కృతిక అనుబంధం ఉందని పేర్కొంటూ, ఇటుకలు, ఉక్కుతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు ఆశ, న్యాయం అందించే కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ భవన నిర్మాణం పూర్తికి కృషి చేసిన అందరినీ అభినందించిన ఆయన, బెంచ్ మరియు బార్ సమన్వయంతో న్యాయ రథం సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
రాజమహేంద్రవరం బార్‌కు గొప్ప న్యాయ వారసత్వం ఉంది
– జస్టిస్ న్యాపతి విజయ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలోని నూతన 10 కోర్టుల భవన సముదాయం నిర్మాణంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ భవన నిర్మాణం ఆలస్యమవడంతో అప్పట్లో కొన్ని న్యాయ వివాదాలు తలెత్తాయని, వ్యయాల పెరుగుదల అంశంపై కాంట్రాక్టర్ తరఫున న్యాయవాదిగా తాను హైకోర్టులో వాదించినట్లు తెలిపారు. అప్పట్లో పొందిన మధ్యంతర ఉత్తర్వులు చివరకు భవన నిర్మాణం పూర్తికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఒకప్పుడు న్యాయవాదిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో పాల్గొన్న తాను, ఇప్పుడు అదే భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో న్యాయమూర్తిగా పాల్గొనడం విశేషంగా అనిపిస్తోందన్నారు. నూతన కోర్టు భవనం అద్భుతంగా నిర్మితమైందని ప్రశంసించిన ఆయన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ మళ్లీ న్యాయ రంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. బార్ సభ్యులు, న్యాయ వ్యవస్థ ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
న్యాయ వారసత్వానికి రాజమహేంద్రవరం నిలయం
– రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్.వి. ప్రసాద్
రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్. వి. ప్రసాద్ మాట్లాడుతూ, నూతన 10 కోర్టుల భవన సముదాయం ప్రారంభం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టమని పేర్కొన్నారు. 2008లో ప్రారంభమైన ఈ భవన నిర్మాణానికి 2012లో శంకుస్థాపన జరిగిందని, దాదాపు 14 సంవత్సరాల తరువాత ఈ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాజమహేంద్రవరం న్యాయ, స్వాతంత్ర్య ఉద్యమ వారసత్వానికి కేంద్రబిందువుగా నిలిచిందని పేర్కొంటూ, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ న్యాయవాదిగా పనిచేసి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. 1895లో న్యాపతి సుబ్బారావు పంతులు 14 మంది న్యాయవాదులతో స్థాపించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రస్తుతం సుమారు 1,500 మంది సభ్యులతో, అందులో 300 మంది మహిళా న్యాయవాదులతో విస్తరించిందని తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు. నూతన కోర్టు సముదాయాన్ని ప్రారంభించిన జస్టిస్ లిసా గిల్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భవన నిర్మాణం పూర్తికి నిరంతర కృషి చేసిన జస్టిస్ బట్టు దేవానంద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాలమైన కోర్టు హాళ్లు, గ్రంథాలయం, ఈ-కోర్టు సదుపాయాలతో కూడిన ఈ సముదాయం న్యాయ సేవలను మరింత ప్రజలకు చేరువ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News