రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో “MSME Talks 2026” పేరుతో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధి, పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై అవగాహన కార్యక్రమం స్థానిక బొమ్మూరు లోని ఆర్టీఐ హెచ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ప్రతినిధులు, MSME యూనిట్ నిర్వాహకులు కలిపి సుమారు 50 మంది పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రవి ఈశ్వరపు మరియు జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) జనరల్ మేనేజర్ జి. వనిధర్ రామన్,, పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవి ఈశ్వరపు మాట్లాడుతూ MSME రంగం దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకలాంటిదని తెలిపారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, స్టార్టప్‌లు మరియు ఇన్నోవేషన్ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామికవేత్తలకు మెంటారింగ్, టెక్నాలజీ సపోర్ట్, మార్కెట్ కనెక్టివిటీ, స్టార్టప్ మార్గదర్శకత్వం అందిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి. వనిధర్ రామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, MSMEలకు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణ సదుపాయాలు మరియు ప్రభుత్వ పథకాలపై సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా యువత పారిశ్రామిక రంగంలోకి రావడానికి జిల్లా పరిశ్రమల శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో MSME గ్రోత్, ఇన్నోవేషన్ & టెక్నాలజీ, ఫండింగ్ & మార్కెట్ యాక్సెస్, నెట్‌వర్కింగ్ అవకాశాలపై ప్రత్యేక చర్చలు నిర్వహించారు. పాల్గొన్న సభ్యులు ప్రభుత్వ పథకాలపై సందేహాలను నివృత్తి చేసుకొని, పారిశ్రామిక అవకాశాలపై అవగాహన పొందారు.
చివరిగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా యువతలో పారిశ్రామిక దృక్పథం పెంపొందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్” లక్ష్య సాధనకు దోహదపడతామని తెలిపారు.
కార్యక్రమంలో RTIH హెడ్ ఇంక్యుబేషన్ చంద్ర ప్రకాష్ మరియు RTIH ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News