-అంతరాయాలపై ప్రజలకూ సమగ్ర సమాచారం అందించాలి
-ప్రజలను, విద్యుత్ శాఖనూ కాల్ సెంటర్లు సమన్వయం చేయాలి
-ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక వేడి, అకాల గాలివానలతో ఫీడర్లు తెగిపోయి విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్న పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బుధవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక ఉష్ణోగ్రతలు, గాలివానల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక వేడి, ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా ట్రాన్స్‌మిషన్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., విద్యుత్ అంతరాయాలపై ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు గానూ.. మీడియా, బల్క్ మెసేజ్ వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని సూచించారు. కాల్ సెంటర్లు విద్యుత్ శాఖకు, వినియోగదారులకు సమన్వయ వ్యవస్థగా పని చేయాలన్నారు. 24 గంటలు పనిచేసే 1912 కాల్ సెంటర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు, క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య 1912 కాల్ సెంటర్లు సమన్వయ వేదికలుగా పని చేయాలని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్‌కో సబ్ స్టేషన్ల పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సబ్ స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచుతూ అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. దీని వలన రాబోయే పదేళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ట్రాన్స్ మిషన్ నష్టాలను తగ్గించవచ్చన్నారు. దీనితో పాటు దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారంపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాల సమయంలో వేగంగా స్పందించేందుకు అదనపు సీపీటీ గ్యాంగులను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవల విభాగాల్లో కింద స్థాయి సిబ్బంది అప్రమత్తత కూడా చాలా కీలకమని మంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లాల ఎస్ఈలు ప్రతి రోజూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని కోరారు. దీనితో క్షేత్రస్థాయిల సిబ్బందిలోనూ జవాబుదారీ వస్తుందన్నారు. ఇటువంటి చర్యలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయన్నారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ట్రాన్స్‌కో జేఎండీ, డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News