Breaking News

“మా మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే… రాజకీయ కాలుష్యం కాదు!..ట్రోలర్లకు మంత్రి దుర్గేష్ ఘాటు కౌంటర్!

-గోదావరి పవిత్రత దెబ్బతింటే ఊరుకోం… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు శిరోధార్యం!:మంత్రి దుర్గేష్
-“పర్యావరణ విధ్వంసకారులకు, నిబంధనలు పాటించని పరిశ్రమలదారులకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు హెచ్చరిక!
-గోదావరి కాలుష్య నివారణే ధ్యేయం… పీసీబీ నోడల్ ఏజెన్సీగా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు… జీవో జారీ చేసిన ప్రభుత్వం!
-త్వరలోనే గోదావరి నదిపై సమగ్ర ‘పొల్యూషన్ ఆడిట్’… పర్యావరణ ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమనైనా ఉపేక్షించం!
-గోదావరి జలాలను కలుషితం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతామంటే సహించబోమని మాస్ వార్నింగ్!
-“ఇకపై మురుగు నీరు నదిలోకి వస్తే… యజమానులు నేరుగా జైలుకే!”
-“గోదావరిలోకి రసాయనాలు వదిలితే… పరిశ్రమలకు తాళాలు ఖాయం!”
-“బెదిరింపులకు లొంగేది లేదు… గోదావరిని ముంచే వారిని వదిలేది లేదు!”
-“పరిశ్రమల లాభాల కోసం… ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టం, పెట్టనివ్వం!
-‘ఆంధ్రా పేపర్ మిల్లు’ యాజమాన్యానికి ఘాటు హెచ్చరిక… రూ.13 కోట్ల మున్సిపాలిటీ బకాయిలపై మంత్రి దుర్గేష్ ఆగ్రహం!
-రూ. 8,500 కోట్లతో 2027 గోదావరి మహా పుష్కరాల భారీ ప్రణాళిక… శరవేగంగా సాగనున్న పనులు!
-గోదావరి పుష్కరాల కోసం పంచాయతీరాజ్ శాఖ నుండి రూ.100 కోట్లు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవకు అభినందనలు
-ఈసారి గోదావరి పుష్కరాలు పూర్తిగా ‘ప్లాస్టిక్ రహితం’… కుంభమేళా తరహాలో పర్యాటక శాఖ తరపున టెంట్ సిటీలు, హోమ్ స్టేల ఏర్పాటు!
-“గోదావరి అంటే మన అమ్మ… అపవిత్రం చేస్తే ఊరుకోదు ఈ ప్రభుత్వం!”
-“ఏ ఘాట్‌లో మునిగినా ఒకటే పుణ్యం… భక్తుల భద్రతే మాకు ముఖ్యం” – భక్తుల్లో అవగాహన కల్పిస్తామన్న మంత్రి దుర్గేష్!
-రూ. 66 కోట్లతో విజ్జేశ్వరం – సిద్ధాంతం ఏటిగట్టు రహదారి (33 కి.మీ) శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధికి చర్యలు
-కేంద్ర సాయంతో ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’… హేవలాక్ బ్రిడ్జి, బ్రిడ్జిలంకల సుందరీకరణకు చర్యలు షురూ!
-త్వరలో సినిమా రంగానికి పూర్వవైభవం… నంది అవార్డులు, నాటకోత్సవాల నిర్వహణపై ఎఫ్‌డీసీ టీమ్ కసరత్తు చేస్తుందని వెల్లడి
-కూటమి ధర్మం పాటిస్తూనే… క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ వినూత్న వ్యూహం రూపొందించారని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-విజయవంతమైన డిప్యూటీ సీఎం రెండు రోజుల రాజమహేంద్రవరం పర్యటన – అధికార, రాజకీయ యంత్రాంగంలో సరికొత్త స్ఫూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల రాజమహేంద్రవరం పర్యటన అత్యంత విజయవంతమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం రాజమహేంద్రవరంలోని హుకుంపేట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం పర్యటనతో అధికార, స్థానిక యంత్రాంగం ఒక్కసారిగా అలెర్ట్ అవ్వడమే కాకుండా, అందరిలో ఒక సరికొత్త స్పూర్తి, జవాబుదారీతనం వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను ఎంత సమర్థవంతంగా నిర్వహించాలనే అంశంపై పూర్తి స్పష్టత, ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ సిద్ధమైందని, కాలుష్య రహితంగా పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ట్రోలర్లకు ఘాటు సమాధానం – నాయకుడి అడుగుజాడల్లో నడుస్తాం..”

ప్రజల ఆరోగ్యం, గోదావరి పవిత్రత విషయంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత బాధ్యత ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు.. ఆ బాధ్యతతోనే డిప్యూటీ సీఎం కొన్ని కీలక సూచనలు చేశారు. నాయకుడి ఆలోచనకు తగ్గట్టుగా, శాఖా మంత్రిగా ఆ సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. మా మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే… రాజకీయ కాలుష్యం కాదు!” అని ట్రోలర్స్ కు మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా సమాధానమిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ నాయకుడని, ఆయన సలహాలు, సూచనలను తానే కాకుండా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నాయకత్వం సమర్థవంతంగా పాటిస్తామని, అది తమ బాధ్యతని అన్నారు.

గోదావరి కాలుష్యంపై ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు..జీవో జారీ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా నల్లాఛానల్ నుండి గోదావరిలోకి డిశ్చార్జ్ అవుతున్న నీరును, కలుషితం అవుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారని మంత్రి తెలిపారు. నిన్న ఆయన కాలుష్యాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని, ఈ క్రమంలో గట్టిగా పని చేయాలని తన, పర బేధం లేకుండా అందులో భాగస్వామ్యులైన వారికి సూచిస్తూ తనకు ఆదేశాలు జారీ చేశారని, ఆ ఆదేశాలను శిరోధార్యంగా పాటిస్తామని చెప్పారు.ఈ క్రమంలో గోదావరి కాలుష్య నివారణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) ను నోడల్ ఏజెన్సీగా చేస్తూ, వివిధ శాఖల అధికారులతో కూడిన ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఉదయమే ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే పేరుతో సంబంధిత జీవో కూడా విడుదలయిందని, కూటమి ప్రభుత్వంలో మాట లానే యాక్షన్ కూడా అంతే స్పీడ్ గా ఉంటుందని తెలిపారు. నదిని కలుషితం చేస్తున్న కారకాలను గుర్తించేందుకు త్వరలోనే సమగ్రమైన ‘పొల్యూషన్ ఆడిట్’ నిర్వహిస్తామని, ఇది నిరంతర ప్రక్రియగా ప్రతిసారి జరుగుతుందని స్పష్టం చేశారు.

పరిశ్రమల యజమానులకు మాస్ వార్నింగ్…రూ.13 కోట్ల బకాయిలపై ఆగ్రహం

స్థానిక వనరులు, సంపదను వినియోగించుకొని ధనార్జన చేస్తున్న కంపెనీలకు మంత్రి దుర్గేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “ప్రజా రక్షణ, పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమనైనా ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా ‘ఆంధ్రా పేపర్ మిల్లు’ వ్యర్థాల తీవ్రతపై ఇప్పటికే పలుదఫాలు చర్చించాం. ఎఫ్ లెంట్ ట్రీట్ మెంట్ చేసే గోదావరిలోకి నీళ్లు వదులుతున్నామని మాకు దొంగమాటలు చెబుతున్నారు. నిన్న స్వయంగా డిప్యూటీ సీఎం, మేము కళ్లారా చూసి నీటి గాఢతను చెక్ చేస్తే పీహెచ్ విలువ 7 కంటే ఎక్కువగానే ఉంది. మీరెంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో నిన్నటి ఘటన చూస్తే స్పష్టమవుతోంది. ఓవైపు లాభాలు పొందుతూ కార్మికులకు కనీసం వేతనాలు ఇవ్వరు” అని కడియం పేపర్ మిల్లు యాజమాన్యంపై మంత్రి ఫైర్ అయ్యారు.కాలుష్య వ్యర్థాలను పరిశ్రమలు వదులుతుంటే వాటర్ వర్క్స్ ద్వారా ప్రజలు ఆ త్రాగునీటిని తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీనిని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని అన్నారు. పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, ఉద్యోగాల కల్పన, రాయితీలు అందిస్తున్నప్పటికీ వారికి కేవలం ధనార్జనే ముఖ్యమైతే చూస్తూ ఊరుకోమన్నారు. మున్సిపాలిటీకి ఆంధ్రా పేపర్ మిల్లు కట్టాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను నేటికీ కట్టలేదని, పలుమార్లు హెచ్చరించినా వారి నుండి సమాధానం లేదని, ఇకపై ఉపేక్షించే ప్రసక్తి లేదని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ధనార్జన చూసుకున్నప్పటికీ, కార్మికుల సంక్షేమం చూసుకున్నప్పటికీ ప్రజల ప్రాణాలతో పరిశ్రమలు చెలగాటమాడొద్దన్నారు. పరిశ్రమలు గానీ, ఇతరులు గానీ మురుగును నేరుగా నదిలోకి వదిలితే ఇకపై బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదు, చట్టప్రకారం నేరుగా జైలుకు పంపే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు.

రూ. 8,500 కోట్లతో గోదావరి మహా పుష్కరాల ప్రణాళిక

13 నెలల్లో గోదావరి పుష్కరాలు రానున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఏడాది కాలంలో వర్షాకాలం పోగా కేవలం 9 నెలల కాలం మాత్రమే అందుబాటులో ఉందని, ఈ తక్కువ కాలంలో ఏయే కార్యక్రమాలు చేయగలం అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పుష్కరాలు జరిగే 6 జిల్లాల పరిధి కోసం దాదాపు రూ. 8,500 కోట్లతో భారీ ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించామని, పనులు శరవేగంగా ప్రారంభించి నాణ్యతతో ఉండేలా చూస్తామన్నారు. పుష్కరాలు జరిగే జిల్లాల్లోని ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడుకి పంపించామని, ఆయన క్రోడీకరించిన అనంతరం పూర్తి కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం లు ప్రత్యేక శ్రద్ధ వహించి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించి ఇతోధికంగా నిధులు సమకూర్చాలని కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.

రూ.100 కోట్ల పంచాయతీరాజ్ నిధులు – ప్లాస్టిక్ రహిత పుష్కరాలు

గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ తరపున రూ. 100 కోట్ల నిధులు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపించడం సంతోషకరమన్నారు. దీనికోసం గ్రామాల్లో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి ఆయా ఘాట్లను బాగు చేసుకొని భక్తులకు సరైన పుణ్యస్నానం చేసేలా పంచాయతీరాజ్ శాఖ, గ్రామాలు, పరిపాలన విభాగాలు కలిసి యాక్షన్ ప్లాన్ తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పుష్కరాలకు వచ్చే దాదాపు 10 కోట్ల మంది భక్తులకు స్వచ్ఛమైన, పవిత్రమైన జలాల్లో పుణ్యస్నానాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈసారి పుష్కరాలను పూర్తిగా ‘ప్లాస్టిక్ రహితం’గా నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. డిప్యూటీ సీఎం సూచన మేరకు పంచాయతీల వారీగా స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గోదావరిని తల్లిగా భావించి వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. ఒక మోడల్ ఘాట్ ను ఏర్పాటు చేసి, దానిపై వచ్చే స్పందనను బట్టి అన్ని ఘాట్లను అదే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామన్నారు.

కుంభమేళా తరహాలో ఏర్పాట్లు – టెంట్ సిటీలు, హోమ్ స్టేలు

పుష్కర భక్తుల కోసం సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక హంగులతో కూడిన హోటళ్లతో పాటు హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. కుంభమేళా తరహాలో ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. “ఏ ఘాట్‌లో స్నానం చేసినా ఒకే పుణ్యఫలం లభిస్తుందని భక్తులకు అవగాహన కల్పిస్తూ భక్తుల రద్దీని నియంత్రిస్తాం. మీడియా ప్రతినిధులు కూడా తమ బాధ్యతను గుర్తుచేస్తూ ఏ ఘాట్ లో స్నానం చేసినా పుణ్యం వస్తుందని ప్రజలకు తెలపాలి” అని కోరారు.స

రూ. 66 కోట్లతో విజ్జేశ్వరం – సిద్దాంతం ఏటిగట్టు రహదారి అభివృద్ధి

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విజ్జేశ్వరం – సిద్దాంతం ఏటిగట్టు రహదారి (33 కి.మీ) అభివృద్ధికి రూ. 66 కోట్లతో డిప్యూటీ సీఎంకు ప్రతిపాదనలు ఇచ్చామని మంత్రి తెలిపారు. దీనివల్ల నిడదవోలు, పెరవలి మండలాల ప్రజలకు రవాణా పరంగా ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. తన అభ్యర్థన మేరకు డిప్యూటీ సీఎం విజ్జేశ్వరంలో పర్యటించడంపై ధన్యవాదాలు తెలిపారు. సీతంపేట, విజ్జేశ్వరం, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల తదితర గ్రామాల మీదుగా వెళ్లే ఏటిగట్టును పుష్కర భక్తుల కోసం, అదే విధంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. ఏటిగట్టును వెడల్పు చేసి ఫ్లడ్ బ్యాంకులా తయారు చేసి రోడ్డు వేస్తే పుష్కరాల భక్తుల కోసం ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రాంతంలో 21 ఘాట్లు ఉన్నాయని, సాధ్యాసాధ్యాలు చూసి పరిశీలిస్తామన్నారు. తాను అడిగిన వెంటనే విజ్జేశ్వరం రావడం సంతోషంగా ఉందన్నారు. చెప్పే పనులకు, చేసే పనులకు సారూప్యత చూపించే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.

కేంద్ర సాయంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు

గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంతో చర్చలు జరిపి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును తీసుకొచ్చామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఎన్నో యేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టును సాధించిందన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కు సమర్పించిన డీపీఆర్ ను, వాటిలోని అంశాలను వివరిస్తూ మీడియా వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని స్థానిక టూరిజం అధికారులకు సూచించానన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు నిడదవోలు కోటసత్తెమ్మ తల్లి దేవాలయం, కడియం నర్సరీలు, రాజమహేంద్రవరం ఇలా నాలుగైదు నియోజకవర్గాలకు సంబంధించిన అంశమన్నారు.పుష్కర్ ఘాట్ అనేది కేవలం పుష్కరాల కోసమే కాదు, అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా దానిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. చారిత్రాత్మక హేవలాక్ వంతెనను ఆధునికీకరించాలన్న ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, బ్రిడ్జిలంకను మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. హేవలాక్ బ్రిడ్జికి వెళ్లాలంటే పుష్కర్ ఘాట్ మీదుగా వెళ్లాలి కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతర్భాగం చేశామన్నారు. పర్యాటకులు, భక్తుల భద్రత లక్ష్యమే తమ ప్రాధాన్యత అన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు అందరం కలిసి ప్రతి పనిని సమీక్షిద్దామన్నారు. కలిసి వెళ్లి ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో స్వయంగా చూద్దామని, లోపాలుంటే సరిచేస్తామని, అంతే తప్ప ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. మీడియా ప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, సమన్వయలోపం లేకుండా అన్ని శాఖలు పనిచేసి పుష్కరాలను విజయవంతం చేస్తామని భరోసా ఇచ్చారు.

సినిమా రంగం అభివృద్ధి – నంది అవార్డుల పునరుద్ధరణ

ఏపీలో సినిమా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, పరిశ్రమ అభివృద్ధికి డిప్యూటీ సీఎం ఇచ్చిన విలువైన సలహాలను, సూచనలను తూచ తప్పకుండా పాటిస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దీనిపై త్వరలోనే సంబంధిత వర్గాలతో సుదీర్ఘంగా చర్చించి తదుపరి అడుగులు వేస్తామన్నారు. ఇటీవలే ఎఫ్ డీసీ కి ఛైర్మన్ , బోర్డు మెంబర్స్ ను నియమించామని, నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణ, ఫిల్మ్ ఫెస్టివల్స్ పై టీమ్ పని చేస్తుందని స్పష్టం చేశారు.

జనసేన పార్టీ బలోపేతానికి వినూత్న వ్యూహం

కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రజా సంక్షేమ పాలనను అందిస్తూనే, క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామని జనసేన నేత కూడా అయిన మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన కమిటీలను తన (కందుల దుర్గేష్), మంత్రి నాదెండ్ల మనోహర్ ల సారథ్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వినూత్నమైన వ్యూహాన్ని రూపొందించారని, ఆ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ఉంటారని, ముగ్గురు సాధక్ లతో కూడిన టీమ్ క్షేత్రస్థాయికి వెళ్లి ఒకరిని సెలెక్ట్ చేసి ఆ నివేదికను డిప్యూటీ సీఎంకు అందిస్తుందని, అనంతరం ఆ కమిటీలను ఫైనల్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లు, ప్రతి జిల్లాకు అధ్యక్షులను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పర్యటనతో అటు గోదావరి పుష్కరాల నిర్వహణ, ఇటు కాలుష్య నివారణపై అధికారులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు పూర్తిగా కొలిక్కి వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ఇకపై ఉమ్మడి గోదావరి జిల్లాల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని పేర్కొన్నారు. “అందరికీ చెప్పేదొక్కటే పవిత్ర గోదావరి మనకు తల్లి లాంటిది.. కలుషితం కాకుండా కాపాడుకుందాం.. ఇది అందరి బాధ్యత” అని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *