Breaking News

జూన్ 1 నుంచి సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు, పట్టా భూముల్లో ఇసుక తీత నిలిపివేత

-మాన్సూన్ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక సరఫరా కొనసాగింపు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MOEF&CC) మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు వర్షాకాలం (మాన్సూన్ సీజన్)గా పరిగణించబడుతున్నందున, ఈ కాలంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల కార్యకలాపాలు నిలిపివేయబడతాయని జిల్లా గనులు మరియు భూగర్భశాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి తెలిపారు.

ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు మరియు పట్టా భూముల్లో జరుగుతున్న ఇసుక తీత కార్యకలాపాలు 01-06-2026 నుండి నిలిపివేయబడనున్నాయని పేర్కొన్నారు.
అయితే వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత తలెత్తకుండా జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, సీతానగరం, రాజమహేంద్రవరం, తాళ్ళపూడి మండలాల పరిధిలో మొత్తం 43 మాన్సూన్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 31-05-2026 నాటికి సుమారు 14.57 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేసినట్లు వెల్లడించారు.
జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయం మేరకు మాన్సూన్ స్టాక్ పాయింట్లలో ఇసుక ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. సెమీ-మెకనైజ్డ్ రీచ్‌ల నుంచి సేకరించిన ఇసుకకు టన్నుకు రూ.160, పట్టా భూముల నుంచి సేకరించిన ఇసుకకు టన్నుకు రూ.214, డీ-సిల్టేషన్ ఇసుకకు టన్నుకు రూ.297 ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
జల వనరుల శాఖ గోదావరి నదికి రెండవ వరద హెచ్చరిక జారీ చేసే వరకు ప్రస్తుతం కొనసాగుతున్న డీ-సిల్టేషన్ రీచ్‌లలో ఇసుక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అక్రమ ఇసుక రవాణా, అధిక ధరలకు విక్రయాలు, ఉచిత ఇసుక విధానంలో దుర్వినియోగాలను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, రవాణా, గనుల శాఖల సమన్వయంతో రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లలో జిల్లా మరియు డివిజన్ స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తాయని పేర్కొన్నారు.

ఎవరైనా నిర్ణయించిన ధరల కంటే అధికంగా ఇసుక విక్రయించినట్లు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇసుకకు సంబంధించిన ఫిర్యాదుల కోసం జిల్లా గనులు మరియు భూగర్భశాఖ కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్ 1800-425-6023 ను సంప్రదించాలని జిల్లా గనులు మరియు భూగర్భశాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *