Breaking News

“యాంటీ మలేరియా మాసం – జూన్ 2026”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా జూన్ నెలను “యాంటీ మలేరియా మాసం – జూన్ 2026” గా నిర్వహిస్తున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన “మలేరియా నిర్మూలన వైపు – ఇప్పుడు మనం చేయగలం, తప్పక చేయాలి” (Towards End Malaria: Now We Can, We Must) అనే థీమ్‌కు అనుగుణంగా, నగరంలో మలేరియా రహిత లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. దోమల ఉత్పత్తి స్థలాలను గుర్తించి నిర్మూలించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మరియు జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మలేరియాను పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు. యాంటీ మలేరియా మాసం సందర్భంగా జూన్ నెలలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని వార్డులలో ఇంటింటి సర్వేలు నిర్వహించి జ్వర కేసులను గుర్తిస్తామని, దోమల లార్వా నియంత్రణకు విస్తృతంగా యాంటీ లార్వల్ ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. దోమల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో క్రమపద్ధతిలో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, నిల్వ నీటి కుంటలు మరియు బావుల్లో దోమల లార్వాలను నివారించేందుకు గంబూసియా చేపలను విడుదల చేస్తామని వెల్లడించారు. అలాగే ఇళ్ల పరిసరాల్లోని నీటి నిల్వలు, ఖాళీ డబ్బాలు, పాత టైర్లు, కూలర్లు తదితర దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. ప్రతి శుక్రవారం నగరవ్యాప్తంగా “డ్రై డే” పాటించడం ద్వారా నిల్వ నీటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని, పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంఘాలు మరియు కాలనీలలో ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటు పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తామని తెలిపారు. నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రజలంతా తమ ఇళ్లలో, పరిసర ప్రాంతాలలో ఎక్కడా నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరికైనా జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *