Breaking News

మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ జీవనోపాధుల బలోపేతమే లక్ష్యం

-ప్రతి గ్రామ సంఘం నుంచి 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలి
-సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి, మహిళల స్వయం సమృద్ధి, స్థిరమైన జీవనోపాధుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వాకాటి కరుణ అధికారులకు సూచించారు. మహిళల సాధికారతకు కేవలం రుణాల మంజూరుతో సరిపెట్టకుండా, వాటి ద్వారా ఆదాయ వనరులు పెరిగేలా, కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా నిరంతర మార్గదర్శకత్వం అందించాలని ఆమె పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల డీఆర్డీఏ సిబ్బంది సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (CCలు), అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు (APMs), జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు (DPMలు) తదితరులతో వివిధ ప్రాజెక్టు కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతి, గ్రామీణ పేద కుటుంబాల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరుగుతున్న ఏసీఎల్పీ (Annual Credit and Livelihood Plan – ACLP) సర్వే ప్రక్రియ, లక్ష్యాల నిర్ణయం, క్షేత్రస్థాయిలో అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ కుటుంబాల వాస్తవ అవసరాలను గుర్తించి, వారి జీవనోపాధి అవకాశాలను పెంపొందించే విధంగా సర్వే నిర్వహించాలని సూచించారు.

ప్రతి గ్రామ సంఘం నుంచి కనీసం 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని ఆమె తెలిపారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, ఆహార ప్రాసెసింగ్, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగం తదితర విభాగాల్లో మహిళలను ప్రోత్సహించి ఆదాయ వనరులు పెంచే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా శిక్షణలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో రైతుల పెట్టుబడి వ్యయాలను తగ్గించేందుకు కమ్యూనిటీ హైర్ సెంటర్లు (CHCలు) కీలక పాత్ర పోషించాలని ఆమె అన్నారు. వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు అద్దె ప్రాతిపదికన అందించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు గ్రామీణ సంఘాలకు అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంపొందించేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముద్రా రుణాలు, బ్యాంకు లింకేజీ కార్యక్రమాలు, జీవనోపాధి ప్రాజెక్టులు, సూక్ష్మ వ్యాపార ప్రోత్సాహక పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. గతంలో రుణాలు మంజూరు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో బాధ్యత పూర్తయిందనే భావన ఉండేదని, ప్రస్తుతం మాత్రం ఆ రుణాలు ఆదాయాన్ని సృష్టించే వ్యాపారాలుగా మారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖలతో సమన్వయం పెంచుకుని సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. గ్రామ సంఘాలు, గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, విద్యా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

క్షేత్రస్థాయిలో సిబ్బంది అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళికలు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధి మెరుగుదల కోసం చేపడుతున్న కార్యక్రమాలపై సమగ్ర వివరాలను అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సెర్ప్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ పథకాల లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, రాబోయే సంవత్సరానికి నిర్దేశించుకున్న కార్యాచరణపై చర్చించారు.
మహిళా సంఘాల విజయాలు ఇతర కుటుంబాలకు ఆదర్శంగా నిలిచేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో సెర్ప్ సిబ్బంది కీలక బాధ్యత వహిస్తున్నారని, లక్ష్య సాధనలో అంకితభావంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అంతకు ముందు సెర్ప్ సి ఈ వో కు స్వాగతం పలకడం జరిగింది. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా, ఆర్థిక నిర్వహణ, వ్యాపార అభివృద్ధి, మార్కెటింగ్ నైపుణ్యాలపై అవగాహన కల్పించడం ద్వారా స్థిరమైన ఆదాయ వనరులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 

ఈ సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బి. నగేష్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు, తూర్పుగోదావరి మరియు కాకినాడ జిల్లాల డీఆర్డీఏ అధికారులు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు (DPMలు), అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు (APMs), కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (CCలు), వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *