-డిజిటల్ సేవల కోసం “మనమిత్ర”యాప్
-నగర కమిషనర్ కె.మయూర్ అశోక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రకాల సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన ప్రజలందరికీ ఎటువంటి అంతరాయం లేకుండా, నిరంతరాయంగా అందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఇంకా ఈ-కేవైసీ చేసుకోకుండా ఉంటే, వారు వెంటనే తమ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకొని, ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ-కేవైసీని పూర్తి చేయడం వల్ల సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు అర్హులైన వారికి సకాలంలో, అత్యంత పారదర్శకంగా అందుతాయన్నారు. అలాగే ప్రజలు వివిధ రకాలైన ప్రభుత్వ సేవలు, అధికారిక సర్టిఫికెట్లు, మరియు అవసరమైన సమాచారాన్ని సులభంగా పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మనమిత్ర” యాప్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇకపై ప్రజలు చిన్న చిన్న పనుల కోసం మరియు దరఖాస్తుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా, ఎక్కడి నుంచైనా డిజిటల్ విధానంలో “మనమిత్ర” సేవల ద్వారా పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నగర ప్రజలందరికీ ఈ అత్యాధునిక డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు వార్డు సచివాలయ కార్యదర్శులు తమకు కేటాయించిన పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ, ప్రజలందరికీ ఈ-కేవైసీ, మనమిత్ర యాప్ పై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి స్వయంగా సహాయం అందిస్తూ ఈ డిజిటల్ సేవలను పూర్తి చేయించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యం మరియు సహకారంతోనే ప్రభుత్వ సేవల పంపిణీ మరింత సమర్థవంతంగా, వేగంగా జరుగుతుందని, నగర ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ డిజిటల్ సేవల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని, నగరంలో వంద శాతం ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతం చేయడానికి సచివాలయ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News