Breaking News

పుష్కర్ ఘాట్ జంక్షన్‌లో పర్యావరణ మానవహారం నిర్వహణ

-ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి.. పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాలి
-ఇకపై అధికారిక సమావేశాలలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దు
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
-ఘాట్‌ల పరిశుభ్రతలో పోటీతత్వం పెంచి ఉత్తమ ఫలితాలు సాధిద్దాం
-ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
-‘మై ఘాట్ – మై రెస్పాన్సిబిలిటీ’తో గోదావరి ఘాట్‌లను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
-నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ సంయుక్త కార్యాచరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక రోజు ముందుగా గురువారం సాయంత్రం పుష్కర్ ఘాట్ జంక్షన్‌లో నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ స్టాళ్లను పరిశీలించి, అనంతరం మానవహారం కార్యక్రమంలో భాగస్వామ్యం అయి స్పూర్తి నింపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ మార్పు అనేది ప్రతి ఒక్కరి నుంచి ప్రారంభం కావాలని అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు క్లాత్ బ్యాగులు, పర్యావరణ హిత వాటర్ బాటిళ్ల వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేధ విధానాల తరహాలోనే రానున్న పుష్కరాల నాటికి తూర్పు గోదావరి జిల్లాలో, రాజమహేంద్రవరంలో కూడా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, నదీ జలాలకు, డ్రైనేజీ వ్యవస్థకు కలుగుతున్న నష్టాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇకపై అధికారులు హాజరయ్యే సమావేశాలకు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవ్వరాదని, వీటి బదులు గాజు సీసాలు ఇవ్వాలని లేదా గాజు లేదా స్టీల్ గ్లాస్ లలో త్రాగునీటినీ ఇవ్వాలని స్పష్టం చేశారు.

రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘మై ఘాట్ – మై రెస్పాన్సిబిలిటీ’ కార్యక్రమం ద్వారా రాజమహేంద్రవరంలోని 14 ఘాట్‌ల రూపురేఖలు మారనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ రాహుల్ మీనాను అభినందించారు. ప్రతి నెల ఘాట్‌ల పరిశుభ్రత ఆధారంగా ర్యాంకింగ్‌లు ప్రకటించడం ద్వారా పోటీతత్వం పెరిగి మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అవలంబించాలని పిలుపునిచ్చారు.

నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ‘మై గోదావరి – మై ప్రైడ్’ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ‘మై ఘాట్ – మై రెస్పాన్సిబిలిటీ’ కార్యక్రమం గోదావరి ఘాట్‌ల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రానున్న పుష్కరాల నాటికి ఘాట్‌లను మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

అనంతరం కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు.

‘‘కలిసికట్టుగా నడుద్దాం – గోదావరిని కాపాడుకుందాం’’ అనే నినాదాలతో మానవహారం నిర్వహించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల పరిరక్షణలో భాగస్వాముల మవుతామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధిస్తామని, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో సెక్రటరీ శైలజవల్లి, ఎస్‌ఈ రీటా, ఎంహెచ్‌వో ఎ. వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, రెవెన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *