Breaking News

గోదావరి పుష్కరాలకు వసతి ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా జిల్లాకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులు, అధికారులు, సేవా సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాల కల్పన కోసం సమగ్ర ప్రణాళికను ముందస్తుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.

బొమ్మూరులోని కలెక్టరేట్‌లో సోమవారం తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, కళ్యాణ మండపాలు, సత్రాలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీ స్థలాలు తదితర వసతి కేంద్రాలను గుర్తించి వాటి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలపై సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు.

ఘాట్లకు 500 మీటర్లు, ఒక కిలోమీటర్, రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భవనాలు, వసతి కేంద్రాలు, ఖాళీ స్థలాలు, పార్కింగ్ ప్రాంతాల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాకు చేరుకునే భక్తులు, వాహనాల సంఖ్యపై అంచనాలు రూపొందించి, వాటి ఆధారంగా వసతి అవసరాలను విశ్లేషించాలని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వసతి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు తదితర వసతి కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఏసీ, నాన్-ఏసీ గదులు, వసతి సామర్థ్యం, పార్కింగ్ సౌకర్యాలకు సంబంధించిన వివరాలతో సమగ్ర డేటాబేస్ రూపొందించాలని ఆదేశించారు.

పుష్కరాల నిర్వహణలో వసతి ఏర్పాట్లు కీలకమని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *