Breaking News

దేశ ఆర్థిక స్వావలంబనకు ఎల్ఐసి కృషి

-యూనియన్ ప్లాటినం జూబ్లీ మానవహారంలో నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశాభివృద్ధికి లక్షల కోట్ల రూపాయల నిధులు అందించి, పట్టాదారుల సేవకు నిరంతరం కట్టుబడిన సంస్థ ఎల్ఐసి అని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగుల పోరాటాలు, అన్ని తరగతుల సిబ్బంది, ఏజెంట్ల కృషి ఎల్ఐసి ని ప్రపంచ అగ్రగామి సంస్థగా చేశాయని తెలిపారు. స్థానిక భవానీపురం ఎల్ఐసి కార్యాలయం వద్ద బుధవారం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఉద్యోగులు మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల కాలంలోనే తమ ఉద్యోగుల సంఘం స్థాపించారని చెప్పారు. పట్టాదారుల మేలు కోరి బీమారంగాన్ని జాతీయకరణ చేయాలని నాడు పోరాటాలు జరిగాయన్నారు. వాటి ఫలితంగా జీవిత బీమా రంగం జాతీయం కావడంతో 1956 సెప్టెంబర్ 1న ఎల్ఐసి సంస్థ ఏర్పడిందని తెలిపారు. నాటి నుండి గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో ప్రజల సొమ్ము ప్రజల కొరకే అన్న నినాదంతో ఎల్ఐసి కృషి చేసిందని చెప్పారు. ప్రజల మౌలిక అవసరాలకు నిధులు అందించడం, పంచవర్ష ప్రణాళికలకు తోడ్పడటం జరిగిందన్నారు. పట్టాదారులకు క్లయిములు చెల్లించడంలో అగ్రగామి ఎల్ఐసి అని చెప్పారు. పాతిక సంవత్సరాల క్రితం మరలా ప్రైవేటు కంపెనీలు దేశంలోకి వచ్చినా, నేటికీ పట్టాదారుల నమ్మకంతో అభివృద్ధి మార్గంలో సాగుతున్న సంస్థ ఎల్ఐసి అని పేర్కొన్నారు. ఎల్ఐసి లో ప్రభుత్వ వాటాల అమ్మకం, బీమా రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులు దేశ హితం, ప్రజాహితం కోరి వ్యతిరేకిస్తున్నామని వివరించారు. కార్యక్రమంకు ముందు యూనియన్ అఖిలభారత నేత సరోజ్ చౌథురి వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించారు. యూనియన్ అభివృద్ధి చేయడంలో సరోజ్ పాత్ర ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజన్ నేతలు ఎన్ ఎం కే ప్రసాద్, సిహెచ్ కళాధర్,ఇవి తులసిరావు, పెన్షనర్ల నేతలు పి కృష్ణ, ఎంఎన్ పాత్రుడు, బ్రాంచ్ నేతలు డి కోటేశ్వరరావు, సిహెచ్ రాజశేఖర్, ఎ విజయదుర్గ, జె మధుసూదన్ రావు, ఎంవి సుధాకర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *