రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా మహిళల ఆర్థిక సాధికారతకు సంబంధించిన రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ కీర్తి చేకూరి, డీ ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ నగేష్, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు రుణాల మంజూరు చెక్కులను అందజేశారు.
డీఆర్‌డీఏ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకు అనుసంధానంతో 270 మంది లబ్ధిదారులకు రూ.3,94,95,000 (రూ.3.95 కోట్లు) విలువైన రుణాలు మంజూరు చేయబడినట్లు తెలిపారు.
అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ఆర్థిక పురోగతికి తోడ్పాటుగా బ్యాంక్ లింకేజీ మరియు స్త్రీ నిధి పథకాల కింద 2,534 స్వయం సహాయక సంఘాలకు చెందిన 16,386 మంది సభ్యులకు రూ.252,14,00,000 (రూ.252.14 కోట్లు) రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
మొత్తంగా మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలకు కలిపి రూ.255.08 కోట్లకు పైగా రుణాలు అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, లబ్ధిదారులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News