“రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామా నాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి, లబ్ధిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, పారదర్శక పాలన, విద్య, వ్యవసాయం, మౌలిక వసతులు, మహిళా సాధికారత, ఉపాధి కల్పన తదితర రంగాల్లో సాధించిన విజయాలను ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోందన్నారు.

ఈ సందర్భంగా సభాద్యక్షులు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, “విద్య”ను ప్రధాన అంశంగా కేటాయించి ఈ రెండేళ్ల వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారుల విజయగాథలను ప్రత్యేక స్టాళ్ల ద్వారా ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.

విద్యారంగంలో సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల విశేషాలను ప్రతిబింబించే స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు.

 

కూటమి ప్రభుత్వంతో నవ్యాంధ్ర ప్రగతి సాధ్యం : మంత్రి నిమ్మల రామానాయుడు

తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, 2014-19 మధ్యకాలంలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు ఏర్పడ్డాయని, అనంతర కాలంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో కొన్ని అంతరాయాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నిలిచిపోయిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో తిరిగి గాడిలో పెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారని , అదే విధంగా విజన్ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ప్రజల సంతృప్తే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి : మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మెరుగైన పరిపాలన అందుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, లబ్ధిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులు అందుకు నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ దృక్పథం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు.

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, పెన్షన్ల పంపిణీ, ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు విస్తృత ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు.

విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో పదో తరగతి వరకు మాత్రమే పరిమితమైన యూనిఫాం పంపిణీని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా విస్తరించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృత్రిమ మేధ (AI) వంటి ఆధునిక అంశాలను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులపై పనిభారం తగ్గింపు వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,393 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం విద్యారంగ బలోపేతానికి దోహదపడిందని తెలిపారు.
పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

ప్రజలతో మమేకమై విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం సహా పలు రంగాల్లో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ప్రస్తుత ప్రభుత్వం వ్యవస్థలను బలోపేతం చేస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడం, విద్యార్థులతో మమేకమవడం, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యారంగంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రజా తీర్పుతో ప్రారంభమైన అభివృద్ధి ప్రస్థానం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు.

గత రెండేళ్లలో రాజమహేంద్రవరం నగరంలో సుమారు రూ.300 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో నిలిచిపోయిన అనేక పనులకు వేగం పెంచి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన నియోజకవర్గంలో 722 కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించడం వంటి కార్యక్రమాలు నగర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. అమృత్ 2.0 పథకం కింద కేంద్ర సహకారంతో రూ.95 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

గత సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్రం : ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గతంలో ఎదురైన ఆర్థిక, పరిపాలనా సవాళ్లను అధిగమిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సామాజిక భద్రతా పింఛన్లను రూ.4,000లకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఎదురైన ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

‘దీపం-2’, ‘అన్నదాత సుఖీభవ’, ‘స్త్రీ శక్తి’, ఉచిత బస్సు ప్రయాణం, ‘తల్లికి వందనం’ వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా ప్రయోజనాలు అందుతున్నాయని వివరించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించే దిశగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

గత పాలనలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తోంది : ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి పరంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంతో పాటు, పారదర్శక పరిపాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పాలనలో అమలుకాని అనేక హామీల కారణంగా ప్రజలు మార్పును కోరుకున్నారని, 2024 ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాల్లా ముందుకు సాగుతున్నాయి : ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించిందన్నారు.

ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ప్రజలకు ప్రశాంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ దృక్పథంతో రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయం : వేగుళ్ల జోగేశ్వరరావు

వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పరిపాలన, సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు.

మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి పార్లమెంట్ నియోజకవర్గంలో చేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

గోపాలపురం నియోజకవర్గంలో రూ.718 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు : ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.

గోపాలపురం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సుమారు 1.10 లక్షల మంది లబ్ధిదారులకు రూ.500 కోట్ల విలువైన సంక్షేమ ప్రయోజనాలు అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.11 కోట్ల మేర సహాయం అందించి పేద కుటుంబాలకు అండగా నిలిచామని పేర్కొన్నారు.

నియోజకవర్గ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.218 కోట్లు కేటాయించి, 548 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.

సంక్షేమానికి రూ.500 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.218 కోట్లు కలిపి మొత్తం రూ.718 కోట్ల వ్యయంతో గోపాలపురం నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.

 

ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, డి.ఆర్.ఓ. ఎస్. భాస్కర్ రెడ్డి, ఆర్.డి.ఓ. ఆర్. శివరాముడు, జిల్లా స్థాయి అధికారులు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు, అధికారులు, లబ్ధిదారులు, డ్వాక్రా సంఘాల మహిళలు, సూపర్ సిక్స్ మరియు ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *