Breaking News

పుష్కరాల నాటికి ఆలయాల అభివృద్ధి పూర్తి చేస్తాం

– గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ సమీక్ష
– దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) కె. రామచంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలోని పలు పుష్కర ఘాట్లు, ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల దేవాదాయ, రెవెన్యూ అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తుల్లో సుమారు 70 శాతం మంది సమీప దేవాలయాలను కూడా దర్శించుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో తొమ్మిది ప్రముఖ దేవాలయాలతో పాటు ఘాట్లకు సమీపంలోని మరో 543 ఆలయాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 162 ఆలయాల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు, టెండర్ల ప్రక్రియ పూర్తయి 43 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మిగిలిన ఆలయాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన క్యూ లైన్లు, షెల్టర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు ఆలయాల సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న క్యాపిటల్ వర్క్స్ అన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా పిండప్రదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కమిషనర్ సూచించారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే సంస్థలను ముందుగానే గుర్తించి, ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రముఖ ప్రైవేటు ఆలయాలను గుర్తించి అక్కడ అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఘాట్లు, ఆలయాల వద్ద సమగ్ర సీసీ కెమెరా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అన్ని ఘాట్లలో హారతి కార్యక్రమాలు సమన్వయంతో నిర్వహించాలని, సంబంధిత అధికారులతో సంయుక్త తనిఖీలు నిర్వహిస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయంతో అన్ని అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా వివిధ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీ నిర్వహణ (Crowd Management)కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పుణ్యస్నాన ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలు, అన్నప్రసాద వితరణ, పిండ ప్రదాన కార్యక్రమాలు, పార్కింగ్, క్యూ లైన్ల ఏర్పాటు, అత్యవసర స్పందన చర్యలు తదితర అంశాలపై దేవాదాయ , రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన నిర్వహించి, అవసరమైన సదుపాయాలు, లోటుపాట్లపై నివేదికను సమర్పించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పుష్కర్ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్, మహేష్, సి ఐ శ్రీనాథ్, దేవాదాయ శాఖ అధికారులు వి. త్రినాథ్‌రావు, టి. దుర్గేష్, డి.ఎల్.వి. రమేష్‌బాబు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈ.వి. సుబ్బారావు, ఏలూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎస్. హరి సూర్యప్రకాశ్ తహసిల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *