-రెండేళ్ల సుపరిపాలనలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల పురోగతిపై విజయవాడ బెర్మ్ పార్క్ లో మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి దుర్గేష్
-దేశీయ పర్యాటకంలో 17 శాతం వృద్ధి.. 13వ స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్
-సాంస్కృతిక రంగానికి పూర్వవైభవం – ‘ఆరెంజ్ ఎకానమీ’తో ఏపీ బ్రాండింగ్
-ప్రతి జిల్లాకు ఒక మ్యూజిక్ కాలేజ్.. కళాకారుల పెన్షన్ల పునరుద్ధరణకు చర్యలు!
-చలనచిత్ర రంగానికి ఊతం – గతంలో ప్రకటించిన వాటితో పాటు 2025 నుండి మళ్లీ ‘నంది అవార్డులు’ ప్రదానం..ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లలో నంది నాటకోత్సవాలు
-2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం.. జులైలో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఉంటుందన్న మంత్రి దుర్గేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మార్చి భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.విజయవాడ భవానీపురంలోని బెర్మ్ పార్క్ లో ఉన్న ధరణి కన్వెన్షన్ హాల్ లో ఈ మేరకు మంత్రి దుర్గేష్ రెండేళ్ల సుపరిపాలనలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల పురోగతిపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల నుంచి 117 ప్రముఖ సంస్థలతో ఎంఓయూలు కుదర్చుకొని దాదాపు రూ.20,000 కోట్ల భారీ పెట్టుబడుల ఆకర్షణ వరకు, జాతీయ స్థాయి అవార్డుల నుంచి ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమలైతే 1,22,637 మందికి ప్రత్యక్ష,పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. అందులో భాగంగా నిర్మాణ దశలో ఉన్న 42 హోటళ్ల ద్వారా 48,168 ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పీపీపీ విధానంలో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామని, అధికారుల సమిష్టి కృషితో ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల గదులు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ లక్ష్యం నెరవేరితే దేశంలో టాప్-5 పర్యాటక రాష్ట్రాల్లో ఏపీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీచ్ శాక్ లో భాగంగా పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ఫోర్స్ ను ఉపయోగించి వైన్, బీర్ సప్లై చేయాలని భావిస్తున్నామని తద్వారా టూరిజం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఫైలట్ ప్రాజెక్టుగా విశాఖ, సూర్యలంక బీచ్ లలో ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో సీఆర్డీఏ ల్యాండ్స్ ను పర్యాటకాభివృద్ధికి కేటాయిస్తామన్నారు. ఇప్పటికే 8 హోటల్స్ కు అనుమతులు మంజూరు చేశామన్నారు.
2019-24 మధ్య పర్యాటక రంగం వెనుకబడిపోయినప్పటికీ, దానిని ప్రత్యేక రంగంగా భావించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని పూర్తిగా మార్చామన్నారు. గత రెండేళ్లలో దేశీయ పర్యాటకుల రాక 17 శాతం పెరిగి 37 కోట్ల ఫుట్‌ఫాల్ నమోదైందని, విదేశీ పర్యాటకుల సంఖ్య 2.62 లక్షలకు చేరిందని వెల్లడించారు. ఫలితంగా దేశంలో 16వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 13వ స్థానానికి చేరుకుందని తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిని యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని, 25 ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ల రూపకల్పన జరుగుతోందని వెల్లడించారు. క్రూయిజ్ టూరిజం, క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టేలు, అడ్వెంచర్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం వంటి రంగాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ఏపీటీడీసీ బ్యాంక్ లోన్ ద్వారా 17 ప్రాంతాలలో ఉన్న రిసార్ట్‌లు / హోటళ్లలో ఆధునీకరణ పనులు చేపట్టామని, రూ. 125.53 కోట్లతో 600 గదులు, 11 రెస్టారెంట్లు, 8 బార్‌లు, 7 కాన్ఫరెన్స్ హాళ్లలో ఎక్స్‌టర్నల్ ఇల్యూమినేషన్ (బాహ్య విద్యుద్దీకరణ), పాత్‌వేస్ (నడకదారులు), ల్యాండ్‌స్కేపింగ్, సీసీ రోడ్లు, వాచ్ టవర్లు, కిచెన్ స్టోర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నాడు విశాఖ రుషికొండలో 58 గదులతో ఉన్న హరిత రిసార్ట్ ద్వారా పర్యాటక శాఖకు ఏటా 7.5 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ గత ప్రభుత్వం దాని స్థానంలో రుషికొండ ప్యాలెస్ నిర్మించడం వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు.ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ రుషికొండను గతంలో మాదిరి రిసార్ట్ గా, ప్రజల సందర్శనార్థం వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం హోటల్స్ అన్నీ ఆపరేషన్ లోకి వస్తే పర్యాటక శాఖకు మరింత ప్రాఫిట్ వస్తుందని,ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. టూరిజం సెక్టార్ 12 శాతం జీడీపీ గ్రోత్ సాధించిందన్నారు. టూరిజం హోటల్స్ లో ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. బీచ్ ల్లో, పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పర్యాటకుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశామని మంత్రి దుర్గేష్ తెలిపారు. తీర ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పెంచి పర్యాటకులకు మరింత రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,855 హోమ్‌స్టేలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక హోమ్‌స్టే పోర్టల్‌ను సిద్ధం చేశామని వివరించారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో రాష్ట్రంలోని 21 ప్రధాన ఆలయాల వద్ద టెంట్ సిటీల ఏర్పాటు ప్రతిపాదనను అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. దేశంలో తొలిసారిగా టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2025ను ప్రవేశపెట్టి పారదర్శక పద్ధతిలో భూ కేటాయింపులు చేస్తున్నామన్నారు. ఇన్వెస్టర్లకు రాయితీలు కల్పించడంతో పాటు రాష్ట్రంలో క్యారవాన్ టూరిజం పాలసీ, హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ తదితర అనుబంధ పాలసీలు ప్రవేశపెట్టి ఆకర్షిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ.428 కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. వాటిలో స్వదేశీ దర్శన్ 2.0 క్రింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ. 97.52 కోట్లు,బొర్రా గుహలకు రూ. 29.87 కోట్లు,సాస్కి క్రింద అఖండ గోదావరి పునరుద్ధరణకు రూ. 94.44 కోట్లు, గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లు, ప్రసాద్ స్కీమ్ కింద అన్నవరం దేవస్థానానికి రూ. 25.32 కోట్లు, సింహాచలంకు రూ. 54.04 కోట్లు, అదే విధంగా సీబీడీడీ క్రింద అహోబిలం స్పిరిచువల్ ఒడిస్సీకి రూ. 24.96 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్‌కు రూ. 25 కోట్లు మంజూరు కాగా ఆయా ప్రాంతాల్లో పనులను 2026 జులైలో పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఏడాదంతా పర్యాటక శోభ ఉండేలా పర్యాటక ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇటీవల కేరళలో జరిగిన జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డు దక్కిందని తెలిపారు. అరకు వ్యాలీకి ‘ఇన్‌స్టాగ్రామబుల్ ల్యాండ్‌స్కేప్’ అవార్డు రావడం మరో గర్వకారణమన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు ఎకో, బ్యాక్ వాటర్, బీచ్, కల్చరల్, అడ్వెంచర్, హెరిటేజ్, బుద్ధిస్ట్, కల్నరీ, క్రూయిజ్ తదితర టూరిజంలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 70 ప్రాంతాలను కవర్ చేస్తూ సాహస పర్యాటక కార్యకలాపాల అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఆల్ ఇండియా టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ అంతర్జాతీయ స్థాయి సమావేశాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్నారని, ఇప్పటికే వారితో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. 2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని, జులైలో కర్టెన్ రైజర్ ప్రోగ్రాం నిర్వహిస్తామన్నారు. గోదావరి పుష్కరాలు భద్రతా పరంగా పకడ్బందీగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఇందుకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సాంస్కృతిక రంగానికి పూర్వ వైభవం
సాంస్కృతిక రంగానికి కూటమి ప్రభుత్వం పునర్వైభవం తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రెండేళ్లలో రెండు విడతలుగా కళారత్న, ఉగాది పురస్కారాలు ప్రదానం చేశామని అందులో భాగంగా తొలి ఏడాది 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది పురస్కారాలు..రెండో ఏడాది 38 మందికి కళారత్న, 123 మందికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేశామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, ఘంటసాల, గుర్రం జాషువా, టంగుటూరి ప్రకాశం పంతులు, బళ్లారి రాఘవ తదితర తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుల జయంతులు, వర్ధంతులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.బుద్ధ జయంతి, ఎన్టీఆర్ జయంతి, స్వాతంత్ర్య సమరయోధుడు మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు.గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం రోజున ప్రముఖ భాషా కోవిదులు, కళాకారులకు ఘన సత్కారం చేశామన్నారు. కళాకారుల పెన్షన్ల పునరుద్ధరణ, కూచిపూడి నృత్య ఉపాధ్యాయుల పథకం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మరియు సంగీత నాటక అకాడమీ సహకారంతో “కృష్ణవేణి సంగీత నీరాజనం” నిర్వహణ..మ్యూజిక్ టూరిజంకు నాంది పలికామన్నారు. తిరుపతిలో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ 10వ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 550 మంది కళాకారులతో రాజమండ్రిలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన చేసి రికార్డు సృష్టించామన్నారు.. బోయి భీమన్న మరియు గుర్రం జాషువా జయంతులలో ప్రముఖులకు విశిష్ట పురస్కారాలు అందించామన్నారు. కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ తో పాటు పిఠాపురం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించామన్నారు. వియత్నాంలో బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శనలో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుతో కలిసి తాను భాగస్వామిని కావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.
రాష్ట్ర పండుగగా కోనసీమ జగ్గన్నతోట ప్రభల తీర్థం ప్రకటించి అద్భుతంగా నిర్వహించామన్నారు. ఇటీవల 51 మంది కవులతో కృష్ణమ్మ అలలపై కదులుతున్న పడవలో కవి సమ్మేళనం చేయడం గొప్పగా అనిపించిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక మ్యూజిక్ కాలేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా యువతను మంచి మార్గంలో నడిపించాలని భావిస్తున్నామన్నారు. సాంస్కృతిక, పర్యాటక రంగాలను సమన్వయం చేస్తూ ఆరెంజ్ ఎకానమీ అభివృద్ధి చేస్తామన్నారు..తద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతామన్నారు. 2027 జూన్ లో క్రియేటివ్ ఎకానమీపై ప్రత్యేక వర్క్ షాపు నిర్వహించాలని యోచిస్తున్నామని స్పష్టం చేశారు.
త్వరలోనే నూతన ఫిల్మ్ పాలసీ.. ఏపీలో 100% షూటింగ్ జరుపుకుంటే భారీ సబ్సిడీ
సినిమా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎఫ్ డీసీ కమిటీ నేతృత్వంలో కొత్త ఫిల్మ్ పాలసీ కి రూపకల్పన జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గతంలో ప్రకటించి ప్రదానం చేయని నంది అవార్డులతో పాటు 2025 సంవత్సరం నుంచి మళ్లీ నంది అవార్డులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల్లో నంది నాటకోత్సవాలను తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే టీవీ, థియేటర్ అవార్డులు కూడా అందిస్తామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు అవసరమైన స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్లు, రీరికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. సింగిల్ విండో విధానంలో భూములు కేటాయించి సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాల ప్రదానం చేశామన్నారు. ఇప్పటికే 100 కోట్ల పైబడి బడ్జెట్ తో నిర్మించే చిత్రాలకు రిలీజ్ అయిన మొదటి 10 రోజుల పాటు టికెట్ రేట్ పెంచుకునే సౌకర్యం కల్పించామని, రాష్ట్రంలో ఫిల్మ్ షూటింగ్స్ కు ఉచితంగా అనుమతులు ఇవ్వడంతో పాటు లో బడ్జెట్ చిత్రాలకు ముందుకు వచ్చేవారికి రిజిస్ట్రేషన్ చేసి త్వరితగతిన ఫ్రీగా షూటింగ్ అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పదే పదే ప్రతి సినిమాకు టికెట్ పెంచుకునేలా ప్రత్యేక జీవోలు ఇవ్వకుండా త్వరలోనే సమగ్ర జీవో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్న మంత్రి దుర్గేష్ 100 శాతం ఏపీలో షూటింగ్ లు జరుపుకునే చిత్రాలను గుర్తించి సంవత్సరానికి 15 చిత్రాలకు 10 లక్షల చొప్పున నగదు సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామన్నారు.. ఇప్పటికే 9 యూనిట్స్ కు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. 24 క్రాఫ్ట్స్ లలో పనిచేసే ఆర్టిస్ట్ ల డేటా బ్యాంక్ సిద్ధం చేస్తున్నామని తద్వారా స్థానిక ప్రతిభకు పెద్దపీట వేస్తామన్నారు.
పర్యాటకం, సంస్కృతి, సినిమా రంగాల సమన్వయంతో రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా “అన్ని ఇజాలు చూశాం.. ఇక మిగిలింది టూరిజమే” అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, టూరిజం ఇంచార్జ్ ఎండీ పద్మావతి, ఈడీ శేషగిరి రావు, శిల్పారామం సీఈవో స్వామినాయుడు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లిఖార్జున రావు, ఎఫ్ డీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News