విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు సూచనలతో బుధవారం డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా పాయకాపురం ప్రాంతంలో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో భాగంగా ప్రజలకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దోమల లార్వాను ప్రత్యక్షంగా చూపిస్తూ, నిల్వ నీటిలోనే ఏడిస్ దోమలు వృద్ధి చెందుతాయని వివరించారు. ఇంటి పరిసరాల్లో కూలర్లు, నీటి ట్యాంకులు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా ప్రతి వారం పరిశీలించి శుభ్రం చేయాలని సూచించారు.
అలాగే కాలువలు, డ్రైన్లు, ఖాళీ స్థలాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా పరిశుభ్రత పాటించాలని కోరారు. వర్షాకాలంలో దోమల ఉత్పత్తి వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు, వృద్ధులు దోమతెరలు వినియోగించడంతో పాటు దోమల నివారణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. డెంగ్యూ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్న యాంటీ లార్వా, ఫాగింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
నగరవ్యాప్తంగా డెంగ్యూ నియంత్రణ చర్యలను ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటికీ లార్వా సర్వేలు నిర్వహిస్తూ దోమల ఉత్పత్తి ప్రదేశాలను గుర్తించి యాంటీ లార్వా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటిస్తూ నీటి నిల్వలను తొలగించడం ద్వారా డెంగ్యూ వ్యాప్తిని సమర్థవంతంగా నివారించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిస్టిక్ మలేరియా ఆఫీసర్ రాజ్ నాయక్, ఆరోగ్య శాఖ సిబ్బంది, మలేరియా విభాగం సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వార్డు సచివాలయ సిబ్బంది, పాయికాపురం కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News