– మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు
– ప్రభావిత చెరువుల నుంచి నమూనాల సేకరణ
– రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన పర్యవేక్షణ
– రైతులకు అప్రమత్తత.. నాణ్యమైన సీడ్, ఫీడ్ మాత్రమే వినియోగించాలి
– రొయ్యల రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వం, అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ఆక్వా ప్రాంతాల్లో రొయ్యలలో “వైట్ గట్” (White Gut) వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయనే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై, యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవిపట్నంలో రైతు పి. మనోజ్ వర్మ చెరువును మత్స్యశాఖ అధికారులు పరిశీలించి, నీరు, రొయ్యలు, ఫీడ్, మల నమూనాలను సేకరించి పరీక్షల కోసం కైకలూరు ప్రయోగశాలకు పంపారని, నీటి నాణ్యత పరీక్షలను భీమవరం ల్యాబ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.
జిల్లా జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, FDOలు, AIFలు, VFAలు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లుగా పనిచేసి ప్రతి ఆక్వా ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని నమోదిత, నమోదుకాని హేచరీలు, ప్రైవేట్ ఆక్వా ల్యాబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, నాణ్యతలేని విత్తనం, నాసిరకం ఫీడ్ విక్రయాలు, తప్పుడు ల్యాబ్ నివేదికలు, నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిపై చట్టపరంగా, శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువుల నుంచి రొయ్యలు, పోస్ట్ లార్వా (PL), ఫీడ్, నీరు, మల నమూనాలను తప్పనిసరిగా సేకరించి PCR పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామని తెలిపారు. వ్యాధి వ్యాప్తికి గల కారణాలను శాస్త్రీయంగా గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులు “1+1” వంటి ఆకర్షణీయ ఆఫర్ల పేరుతో నాణ్యత లేని రొయ్య పిల్లలను కొనుగోలు చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. తప్పనిసరిగా ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేయాలని, చెరువు సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే పిల్లలను వదలాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనం వివరాలను నమోదు చేసి భద్రపరచుకోవాలని చెప్పారు. చెరువుల నిర్వహణలో బయోసెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రతి పంట అనంతరం చెరువును పూర్తిగా ఎండబెట్టడం, సిల్ట్ తొలగించడం, సున్నం వేయడం, క్రిమిసంహారక చర్యలు చేపట్టడం ద్వారా వ్యాధికారకాలను పూర్తిగా నిర్మూలించాలని తెలిపారు. CIBA సూచించిన ఉత్తమ నిర్వహణ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ అంశంపై స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, NASPAD, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ, MPEDA, CIBA, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనిటిక్ రిసోర్సెస్ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థలతో సమన్వయం చేసి శాస్త్రీయ పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నవీకరించిన SOPలను రూపొందించి, ఫిషరీస్ యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా మత్స్యశాఖ అధికారులు ఏడు రోజుల్లోగా తనిఖీలు, నమూనాల సేకరణ, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించామని మంత్రి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించడంలో లేదా ఈ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రొయ్యల రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
Prajavartha Online Telugu News