-నాలుగు జిల్లాల్లో వరుస కార్యక్రమాలతో బిజీ
-హీరో, అడిడాస్, జేఎస్‌డబ్ల్యు వంటి ప్రఖ్యాత సంస్థలకు శంకుస్థాపన
-3 రోజుల కుప్పం పర్యటనలో 30కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
-సోమవారం ఉదయం కుప్పం నుంచి నేరుగా వెలగపూడి సచివాలయానికి సీఎం
-ఆర్టీజీఎస్, 3 ప్రాంతాల ఎకనమిక్ రీజియన్లపై సీఎం సమీక్ష
కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
వరుసగా వారం రోజుల జిల్లాల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరిగి అమరావతికి రానున్నారు. సోమవారం ఆర్టీజీఎస్ సమీక్షతో సహా పలు సమావేశాలు నిర్వహించనున్నారు. వారం రోజులు క్షణం తీరిక లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు… మొత్తం 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంవోయూలు, సంక్షేమ కార్యక్రమాలు, రైతులు-ప్రజలతో ముఖాముఖి వంటి సమావేశాలతో పర్యటన సాగింది. ఈనెల 1వ తేదీన అమరావతి నుంచి బయలుదేరి నేరుగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో మొదట పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లిన సీఎం చంద్రబాబు పద్మమ్మకు ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛను, తులశమ్మకు దివ్యాంగ పింఛన్ అందించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఇప్పటి వరకూ రూ.68,598 కోట్ల మేర పెన్షన్ల కింద కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. అభివృద్దిలో సంపద సృష్టిలో నెల్లూరు జిల్లా దేశంలోనే అగ్రగామి జిల్లాగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, తర్వలో నెల్లూరు జిల్లాలో మెగా ఫర్నిచర్ పార్కు కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని ప్రకటించారు.
హీరో మోటార్స్‌కు శంకుస్థాపన
నెల్లూరు జిల్లాలో పేదల సేవలో కార్యక్రమం పూర్తి కాగానే… అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వెళ్లారు. అక్కడ హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌తో కలిసి పీ4 లో భాగస్వామ్యం వహించేందుకు హీరో మోటార్స్ కార్పోరేషన్ ఈ సందర్భంగా ముందుకు వచ్చింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ హీరోస్ ఆఫ్ టుమారో పేరిట ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్‌లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
2వ తేదీ వీబీ జీ రామ్ జీ ప్రారంభం
2వ తేదీ ఉదయం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీని తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనుల్ని ముగ్గురు నేతలూ లాంఛనంగా ప్రారంభించారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు కలిసి వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులను అందజేశారు. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్రం మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో వీబీ జీ రామ్ జీ కింద పనులు చేపట్టనున్నాయి.
ప్రణాళిక శాఖ వర్క్ షాప్‌కు హాజరు
వీబీ జీ రామ్ జీ పథకం ప్రారంభించిన అనంతరం 2వ తేదీ సాయంత్రం సీఎం చంద్రబాబు తిరుపతి చేరుకున్నారు. అక్కడ స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రణాళిక శాఖ తిరుపతిలో నిర్వహించిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ పేరుతో జరిగిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత, సమర్థవంతమైన పరిపాలన ద్వారానే రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమని వర్క్ షాపులో సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గార్గ్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.వి. రాజు, ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ వంటి ప్రముఖులు ఈ వర్క్ షాపులో పాల్గొన్నారు.
3వ తేదీన రాయల సీమ స్టీల్ పనుల ప్రారంభం
రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా ఈనెల 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపు రాళ్ల పల్లిలో జిందాల్ సౌత్ వెస్ట్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జేఎస్‌డబ్ల్యూ చైర్మన్, సీఎండీ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మలతో కలిసి సీఎం ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. రాయల సీమ స్టీల్ ప్లాంట్‌తో పాటు అనుబంధంగా నిర్మిస్తున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులూ సీఎం ప్రారంభించారు. ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానుంది. ఉక్కు ఉత్పత్తి, సోలార్ ప్రాజెక్టు ద్వారా 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 3,850 మెగావాట్ల సామర్ధ్యంతో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేసేలా నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. రూ.20,350 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. జమ్మలమడుగు నుంచి విజయనగరం జిల్లాలోని జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కును కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో 1,166 ఎకరాల్లో అత్యాధునిక పారిశ్రామిక పార్కును జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.531 కోట్లను జిందాల్ సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది.
కుప్పం 3 రోజుల పర్యటన సక్సెస్
ఈనెల 3వ తేదీన కడప నుంచి నేరుగా ముఖ్యమంత్రి 3 రోజుల పర్యటన కోసం కుప్పం వచ్చారు. గుడుపల్లె మండలం పొగురుపల్లిలో నిర్వహించిన ‘స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30 ప్రాజెక్టులకు ఎంవోయూలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా 47,539 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ విమానాల తయారీ ప్రాజెక్టు వరకు వీటిలో ఉన్నాయి. పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికిన్ ప్రాసెసింగ్ యూనిట్ ABIS ప్రొటీన్స్ సంస్థను, 167 పారిశ్రామిక ప్లాట్లతో తీర్చిదిద్దిన APIIC MSME పార్క్‌ను సీఎం ప్రారంభించారు. అలాగే 7,489 మంది SC, STల ఇళ్లపై రూ.28 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను ప్రజలకు అంకితం చేశాం. ఐదు RESCO సబ్‌స్టేషన్లు ప్రారంభించారు. 46 వేలకుపైగా BC, OC కుటుంబాల ఇళ్లపై రూ.559 కోట్లతో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
మోడల్ బస్ స్టేషన్‌కు శంకుస్థాపన
కుప్పం పట్టణాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా రెండవ రోజుల పర్యటనలో అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.118 కోట్లతో నిర్మించే ఈ మోడల్ బస్ స్టేషన్ రాష్ట్రంలోనే అత్యాధునిక బస్ స్టేషన్లలో ఒకటిగా నిలవనుంది. అదే రోజు ఆరు దశాబ్దాల కంగుంది భూసమస్యకు సీఎం పరిష్కారం చూపారు. ‘అడవి పోరంబోకు’ నుంచి ‘అసెస్డ్ వేస్ట్ డ్రై’గా వర్గీకరించి భూములు సాగు చేస్తున్న రైతన్న కుటుంబాలకు మేలు చేశారు. మొత్తం 322 మంది అర్హులైన లబ్ధిదారులకు 460.19 ఎకరాలపై డీకేటీ పట్టాలు అందజేశారు. మరోవైపు కుప్పం ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆసుపత్రిలో పంచతత్వ కాన్సెప్టుతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం స్వర్ణ కుప్పం స్వచ్ఛ కుప్పం స్వాగత ఆర్చ్‌ను ప్రారంభించారు.
రైతులు, పీ4 లబ్దిదారులతో ముఖాముఖి
కుప్పంలో మూడవ రోజు పర్యటనలో ఆదివారం పౌల్ట్రీ రైతులు, అభ్యుదయ రైతులు, పీ4 లబ్దిదారులతో సీఎం ముఖాముఖి సమావేశం అయ్యారు. ‘పర్యావరణ నియంత్రిత పౌల్ట్రీ ఫారం’ను సీఎం ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రైతులతో మాట్లాడారు. ఆధునిక పౌల్ట్రీ షెడ్‌తో లాభాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కుప్పం అభ్యుదయ రైతులతో సమావేశమైన పలు అంశాలను చర్చించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగిన పురోగతిపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో స్థానిక రైతులకు ప్రయోజనం కలిగించేలా ఐటీసీ సంస్థతోనూ, ఆధునాత వ్యవసాయ విధానాలు అనుసరించేలా విశాలాక్షి ఇన్నోవేషన్స్ సస్టెయినబుల్ వ్యాల్యూ చైన్ సంస్థతోనూ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే కుప్పం- పీ4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. బంగారు కుటుంబాలు ఆర్ధికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కుప్పంలో 9 వేల బంగారు కుటుంబాల బాధ్యతను అదానీ, టీవీఎస్, మెగా సంస్థలకు అప్పగించామని ముఖ్యమంత్రి అన్నారు. ఆదివారం రాత్రి కుప్పంలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి… సోమవారం ఉదయం 11 గంటలకు నేరుగా కుప్పం నుంచి అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి చేరుకుంటారు. సోమవారం కూడా అధికారిక సమీక్షలు, సమావేశాలతో ముఖ్యమంత్రి బిజీగా గడపనున్నారు. ఉదయం ఆర్టీజీఎస్ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజీయన్లకు సంబంధించి అభివృద్ధి కార్యాచరణపై అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తారు.
Prajavartha Online Telugu News