దేవుడిపై భక్తిని రాజకీయాలకు బలిచేయొద్దు

-ఆలయాలపై అసత్య ప్రచారాలతో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం అత్యంత దురదృష్టకరం
-రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేవుడిపై భక్తిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం, ఆలయాలపై అసత్య ప్రచారాలు చేయడం, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి కుట్రలనైనా రాష్ట్ర ప్రభుత్వం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థలపై అనుమానాలు సృష్టించడం, భక్తుల్లో అపోహలు కల్పించడం, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం అనే రాజకీయ ఉద్దేశంతో నిరాధారమైన కథనాలతో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత దురదృష్టకరమైన విషయం అన్నారు.

అదే విధంగా దేవాదాయ శాఖపై అసంపూర్ణ గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ధర్మ పరిరక్షణ, ఆలయాల సమగ్రాభివృద్ధి, భక్తులకు అత్యుత్తమ సేవలందించడం, పారదర్శక పాలనను మరింత బలోపేతం చేయడం పట్ల ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. వాస్తవాలు, పూర్తి గణాంకాలు, పారదర్శక సమాచారంతో చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

దేవాలయాలు రాజకీయ ప్రయోగశాలలు కావు…
దేవాలయాలు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకలని, వాటిని రాజకీయ ప్రయోగాలకు వేదికలుగా మార్చే ప్రయత్నాలను ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని మంత్రి స్పష్టం చేశారు. అసంపూర్ణ గణాంకాలు, వక్రీకరించిన సమాచారం ఆధారంగా ప్రజల్లో అపోహలు సృష్టించడం ఎంతో బాధ్యతారాహిత్యమని అన్నారు. విమర్శలు చేయాలంటే పూర్తి వాస్తవాలు, సమగ్ర గణాంకాలు, నిర్ధారిత సమాచారం ఆధారంగానే చేయాలని, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

మా ప్రభుత్వం మాటల్లో కాదు… చేతల్లో చూపిస్తోంది…
కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, ధర్మ పరిరక్షణ, భక్తులకు మెరుగైన సేవల కల్పనను అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తోందని మంత్రి తెలిపారు. చారిత్రక దేవాలయాల పునరుద్ధరణ, పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల విస్తరణ, డిజిటల్ సేవలు, అన్నప్రసాద కార్యక్రమాల విస్తరణ వంటి అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. ఈ అభివృద్ధిని కప్పిపుచ్చేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేయడం విచారకరమన్నారు.

గతంలో ఎందుకు స్పందించలేదో సమాదానం చెప్పాలి…
ఈరోజు దేవాలయాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు, గత పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాలు, రథాల దహన ఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అదే స్థాయిలో స్పందించారా? ప్రధాన కథనాలు ప్రచురించారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం వాస్తవాలను వక్రీకరించి భక్తుల్లో అనవసర అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు.

దేవాదాయ శాఖ వ్యాపార సంస్థ కాదు…
దేవాదాయ శాఖ లక్ష్యం ఆదాయం ఆర్జించడం కాదని, ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమేనని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్ణయించిన రుసుములనే కొనసాగిస్తున్నామని, అదనపు భారం మోపకుండా కోట్లాది రూపాయలతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. భక్తులను హుండీలు నింపే వారిగా కాకుండా ధర్మ సంరక్షకులుగా చూస్తున్నామని అన్నారు.

ఆదాయాలపై అసత్య ప్రచారం…
కొన్ని గణాంకాలను మాత్రమే చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని మంత్రి విమర్శించారు. వాస్తవానికి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ప్రధాన దేవాలయాల్లో మొత్తం ఆదాయం, హుండీ ఆదాయం, భక్తుల సంఖ్య అన్నీ పెరిగాయని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వాస్తవ గణాంకాలు…
రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాల మొత్తం ఆదాయం 2023-24లో రూ.1,379.19 కోట్లు ఉండగా, 2025-26 నాటికి రూ.1,503.90 కోట్లకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. మొత్తం రూ.124.71 కోట్ల అదనపు ఆదాయం నమోదై దాదాపు 9 శాతం వృద్ధి సాధించబడిందన్నారు.

అదేవిధంగా 2023-24లో 634.68 లక్షల మంది భక్తులు ప్రధాన దేవాలయాలను సందర్శించగా, 2025-26లో ఆ సంఖ్య 805.04 లక్షలకు చేరుకుందని తెలిపారు. అంటే అదనంగా 170.36 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, ఇది సుమారు 27 శాతం వృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా శ్రీశైలం దేవస్థానంలో ఆదాయం రూ.178.82 కోట్ల నుంచి రూ.217.24 కోట్లకు పెరిగిందని, భక్తుల సంఖ్య 82.18 లక్షల నుంచి 119.71 లక్షలకు చేరుకుందని తెలిపారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి ఆలయంలో ఆదాయం రూ.23 కోట్ల నుంచి రూ.56 కోట్లకు పెరిగిందన్నారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తుల సంఖ్య 93.40 లక్షల నుంచి 119.34 లక్షలకు, అన్నవరం దేవస్థానంలో 45.50 లక్షల నుంచి 57.87 లక్షలకు పెరిగిందని వెల్లడించారు.

ఆదాయం ఒక్కటే భక్తికి కొలమానం కాదు…
ఆలయాల పనితీరును కేవలం నికర ఆదాయం ఆధారంగా అంచనా వేయడం సరైన పద్ధతి కాదని మంత్రి పేర్కొన్నారు. భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం, సేవల విస్తరణ, దాతల విరాళాలు, అన్నప్రసాద కార్యక్రమాలు, డిజిటల్ సేవలు, ఇతర ఆదాయ వనరులు వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించినప్పుడే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని అన్నారు.

అన్నప్రసాద సేవల విస్తరణ…
ప్రస్తుతం రాష్ట్రంలోని 111 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ జరుగుతోందని మంత్రి తెలిపారు. ప్రతిరోజూ సుమారు 80 వేల మంది, నెలకు 24 లక్షల మంది, సంవత్సరానికి దాదాపు 3 కోట్ల మంది భక్తులకు అన్నదానం అందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.84 కోట్లు వెచ్చిస్తోందని, త్వరలో మరో 59 ఆలయాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.

పారదర్శక పాలన – డిజిటల్ సంస్కరణలు…
హుండీ లెక్కింపును పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో, అధికారులూ, బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దాదాపు 70 శాతం మంది భక్తులు ఆన్‌లైన్, మనమిత్ర తదితర డిజిటల్ సేవలను వినియోగిస్తున్నారని, హెల్ప్‌డెస్కులు, కియోస్కులు, డిజిటల్ వ్యవస్థల ద్వారా సేవలను మరింత పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు.

ఆలయాల అభివృద్ధిలో అపూర్వ పురోగతి…
గత ప్రభుత్వం 919 దేవాలయాలకు నిధులు మంజూరు చేసినప్పటికీ కేవలం 372 పనులు మాత్రమే పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులను వేగవంతం చేసి ఇప్పటికే 282 పనులు పూర్తి చేసిందని, మరో 236 పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

అదనంగా 659 దేవాలయాలకు రూ.789.92 కోట్లతో అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని 276 దేవాలయాల అభివృద్ధికి రూ.87.03 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే టీటీడీ సహకారంతో రూ.750 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆలయం లేదా భజన మందిరం ఏర్పాటు చేసే మహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు సీతారామాంజనేయ ప్రసాద్ , కమినషర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *