-వర్క్‌షాపు పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపులో ఈరోజు అనగా 17 నవంబర్, 2021 తేదీన వార్షిక తనిఖీలు నిర్వహించారు. జనరల్ మేనేజర్ వెంట విజయవాడ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ శ్రీ శివేంద్ర మోహన్ మరియు ఇతర సీనియర్ అధికారులు (ప్రధాన కార్యాలయం మరియు డివిజన్ కార్యాలయాల నుండి) ఈ తనిఖీలలో పాల్గొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వ్యాగన్ల పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ (పిఓహెచ్) నిర్వహణలో రాయనపాడులోని వర్క్‌షాప్ ప్రధానమైన వర్క్‌షాపు. వ్యాగన్ల భద్రత నిర్వహణకు మరియు అవి దీర్ఘకాలంగా కొనసాగడానికి వ్యాగన్లకు పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ ఎంతో ముఖ్యం.
తనిఖీలలో భాగంగా, జనరల్ మేనేజర్ వర్క్‌షాపు ప్రధాన ప్రవేశ మార్గం వద్ద థర్మల్ స్క్రీనింగ్ సిస్టం, రిమోట్ కంట్రోల్ ద్వారా గేట్ నిర్వహణ పద్ధతిని ప్రారంభించారు. ఆయన ఓపెన్ కోల్ హోప్పర్ వ్యాగన్ (బిఓబిఆర్) పిఓహెచ్ రేక్‌ను జెండా ఊపి ప్రారంభించారు మరియు 75 కెఎల్‌డి సామర్థ్యం గల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆయన తనిఖీలను స్ట్రిప్పింగ్ షాఫు నుండి ప్రారంభించారు మరియు సిబ్బంది భోజనశాల, ఎయిర్ బ్రేక్ విభాగాల వద్ద తనిఖీలు చేపట్టారు. ఆయన మరమ్మతుల షాప్ వద్ద వ్యాగన్ల కాలానుగుణ నిర్వహణ కార్యకలాపాలను కూడా పరీక్షించారు.
గజానన్ మాల్య డిస్ట్రిబ్యూటర్ వాల్వ్ అసెంబ్లీ కమ్ టెస్ట్ బెంచ్‌ను ప్రారంభించారు. వర్క్‌షాపులో పనుల నిర్వహణలో సౌకర్యం కోసం 20 టన్నుల ఈఓటి క్రేన్, 500 టన్నుల హైడ్రాలిక్ ప్రెస్, సిఎన్‌సి యాక్సిల్ జర్నల్ టర్నింగ్ మరియు బర్నిషింగ్ లాత్, పోర్టల్ వీల్ లాత్ మరియు వర్క్‌షాప్ సమాచారం అందించే సిస్టం (డబ్ల్యుఐఎస్‌ఈ పాయింట్) వంటి వివిధ పరికరాలను ప్రారంభించారు. జనరల్ మేనేజర్ సెంటర్ బఫర్ కప్లర్ (సిబిసి), బోగి సెక్షన్‌లో కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆయన అక్కడ మొక్కలను నాటారు మరియు వర్క్‌షాపులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు.
అనంతరం, జనరల్ మేనేజర్ రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపు కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్కషాపు వారిచే చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ఆయన సమీక్షించారు మరియు అక్కడ మరింత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తనిఖీల సందర్భంగా వర్క్‌షాపులోని కార్మిక సంఘాల ప్రతినిధులు జనరల్ మేనేజర్‌ను కలుసుకొని, సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలపై వారితో చర్చించారు.