తప్పులు లేని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి : నగర కమిషనర్ మయూర్ అశోక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో తప్పులు లేని, అత్యంత స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ నగర ప్రజలను కోరారు. గురువారం కమిషనర్ బాలాజీ నగర్, ఎల్బీ నగర్, ఇశ్రాయేల్ పేట, ఆర్టీసి కాలనీల్లోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను ప్రత్యక్ష్యంగా పరిశీలించి, బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత 25 రోజులుగా నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన కీలకమైన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో 99 శాతం పూర్తయిందన్నారు. నగరం నుండి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఇళ్లు మారిన వారు (షిఫ్టెడ్), మరణించిన వారి (డెత్ కేసెస్) ఫారాలు మినహా, మిగిలిన అర్హులైన ఓటర్లందరికీ ఈ ఫారాలను విజయవంతంగా చేరవేసినట్లు పేర్కొన్నారు. ఓటర్ల నుంచి తిరిగి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను సకాలంలో ఆన్‌లైన్ (డిజిటలైజేషన్) చేసే ప్రక్రియను కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక ప్రక్రియ ముగియడానికి ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే గడువు ఉందని, కాబట్టి ఎన్యుమరేషన్ ఫారాలు కలిగిన ఓటర్లందరూ ఆలస్యం చేయకుండా వాటిని వెంటనే మీ ప్రాంత పరిధిలోని బీఎల్ఓ కు అందించాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని, గతంలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా నాలుగు రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను (స్పెషల్ క్యాంపెయిన్) నిర్వహించామని తెలిపారు. ఎవరైనా ఓటర్లు ఇంకా ఫారాలు అందజేయకపోతే, వారి కోసం జిఎంసి సిబ్బంది గురు, శుక్రవారాలు (రెండు రోజుల పాటు) మళ్లీ ప్రతి ఇంటికీ వచ్చి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరిస్తారని వివరించారు. సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లు తమ ఫారాలపై తక్షణమే సంతకం చేసి అందిస్తే, వాటిని వెంటనే డిజిటైజ్ చేస్తామని చెప్పారు. ఒకవేళ ఎవరికైనా ఎన్యుమరేషన్ ఫారం అందక, పొరపాటున ఓటు తొలగింపునకు గురైతే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారికి మళ్లీ ఓటు హక్కు పొందేందుకు పూర్తి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అటువంటి వారు కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం-6 ద్వారా లేదా ఒక నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి, వివరాల మార్పుల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నగర ఓటర్లందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై, ఎలాంటి అపోహలు లేకుండా అధికారులకు సహకరించి గుంటూరు నగర ఓటర్ల జాబితాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు.
పర్యటనలో ఏఈఆర్ఓలు మాధురి, మహ్మద్ రఫీ, సూపర్వైజరీ అధికారులు వెంకటేశ్వరరావు, హయషావలి, బిఎల్ఓలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *