-20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని రైతులు న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమయ్యేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాయని,2035 నాటికి మన రాష్ట్రంలో 60 లక్షలకు పైగా రైతుల ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం లక్ష్యంగా పనిచేస్తున్నామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సేద్యం సాగు పెంపుపై వ్యవసాయ శాఖ ఎక్స్ అపిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరి బి.రాజశేఖర్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్,ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫైయింగ్ అథారిటి ఛైర్మన్ శ్రావణ్ దత్ లతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలోని అంశాలను ఆయన ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ ప్రకృతి సేద్యంపై రైతుల ఆసక్తిని పెంచి వారికి లాభార్జన కలిగించటంతో పాటు పర్యావరణ హితానికి మన వంతు సహకారం అందించడం,అలాగే భూమి తల్లిని రసాయన ఎరువుల నుండి కాపాడటమే లక్ష్యంగా 2016లో అడుగులు వేయడం జరిగిందన్నారు.ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో, 8168 గ్రామాల్లో నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.2035 నాటికి 60 లక్షల మంది రైతులు, 20 లక్షల కుటుంబాలు ప్రకృతి సేద్యంలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. ఇక 2026-27 వ సంవత్సరానికి 23 లక్షల మంది రైతుల ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా లక్ష్యంగా పెట్టుకుని ఆయా శాఖలు పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఇప్పటి వరకు రూ.1560 కోట్లు ప్రకృతి సేద్యం పెంపుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించాయన్నారు.వీటిలో 1250 కోట్లు కేంద్ర ప్రభుత్వం, రూ.310 కోట్లు వివిధ సేవా దృక్పదం ఉన్న దాతలు సమకూర్చారని వివరించారు.ఇక రాబోయే 5 సంవత్సరాల్లో వ్యయం రూ.3800 కోట్లు గా అంచనా వేయడం జరిగిందన్నారు.40 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ప్రకృతి సేద్యంను ప్రోత్సహించడానికి సీఆర్పీలు, పార్మర్స్ సైంటిస్ట్స్ ను నియామకం చేసి వేగవంతం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంను అమలు చేయడం వల్ల రసాయన ఎరువుల వాడకం 10 శాతానికి పైగా తగ్గుదల స్పష్టంగా చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు.ఈరసాయన ఎరువుల వాడకంను భారీ స్థాయిలో తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.తద్వారా భూమి విషతుల్యం కాకుండ చూడటంతో పాటు పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని అన్నారు.రసాయన ఎరువులు వాడిన భూమి, ప్రకృతి వ్యవసాయంపై ఆధారపడి సాగు చేసిన భూములను పరిశీలిస్తే వరిలో 56 శాతం ఆదాయం పెరిగిందన్నారు. పత్తి పంట సాగులో 97 శాతం పెరుగుదల ఉండటం అభినందనీయమన్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట ద్వారా ఆయా రైతులు కనీసం 20 శాతం కంటే అదనపు ఆదాయం పొందటంతో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని ఇది మంచి పరిణామమన్నారు.అంతే కాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా 365 రోజులు అంటే ఎడాది మొత్తం ఆదాయం పొందవచ్చని అన్నారు.
ఎల్ నినో ప్రభావం రైతులపై అమితంగా ఉంటుందని,కాని ప్రకృతి సేద్యంతో ఈ దుస్థితిని అధిగమించవచ్చన్నారు.ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భూమి వెడెక్కడంలో 33 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల గమనించడం జరిగిందని,అదే రసాయన ఎరువులు వినియోగిస్తున్న వ్యవసాయ భూమిలో 55 డిగ్రీల సెల్సియస్ వేడి ఉత్పన్నమవ్వడం నిపుణులు గమనిచడం జరిగిందన్నారు.కరువు మహమ్మారి నుండి రైతులు తట్టుకుని నిలబడటానికి ప్రకృతి వ్యవసాయంలో సహారా ఎడారి ప్రాంతంలో అవలించిన అర్థచంద్రాకర సాగు పద్దతిని పాటించడం ద్వారా కరువు ప్రభావం నుండి అధిగమించవచ్చని సూచించారు.
మామిడి,మిర్చి పంటల్లో అధిక రసాయన నమూనాలు ఉన్నాయని కొన్ని దేశాలు తిరస్కరించిన విషయం కూడా విదితమే.ఇలాంటి ప్రతికూల పరిస్థితులు రాకుండా ఉండటానికి ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపడం అత్యుత్తమ పద్దతి అని తేల్చి చెప్పారు.రైతు సాధికార సంస్థ దేశంలోనే అత్యంత అద్భుతంగ పనిచేస్తున్న సంస్థగా పేరుగడించిందన్నారు.దేశ వ్యాప్తంగా 61 జిల్లాల్లో రైతు సాధికర సంస్థ సేవలు అందిస్తుందన్నారు.రసాయన ఎరువుల వాడకం నుండి ప్రకృతి సేద్యం సాగు వైపు రైతులు మళ్లేలా చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకృతి సేద్యం సాగును పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి రక్షణను ఇవ్వాలన్న దృక్పదంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.321 కోట్లను కేటాయించాలన్న ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు.ఇప్పటికే రాష్ట్రానికి రూ.100 కోట్లు కేంద్రం విడుదల చేసిందన్నారు.క్యాబినెట్ ఆమోదం అనంతరం బ్యాలెన్స్ నిధులు రాష్ట్రానికి అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 13,800 గ్రామ పంచాయితీలను ప్రకృతి సేద్యంలో మమేకం చేయడానికి కేంద్రం అందించే రూ 321 కోట్లు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ నిధుల విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖను సైతం కేంద్రానికి పంపడం జరిగిందన్నారు.ఇప్పటికే అందిన రూ.100 కోట్ల నిధులతో 9170 గ్రామ పంచాయితీల్లో కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందన్నారు.నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ ను ప్రారంభించిన సమయంలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉందని,అయితే రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో మెర్జ్ చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కావున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పాత విధానన్ని కొనసాగించాలని అధికారులు కోరుతున్నారన్నారు.అలాగే నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ కాలపరిమితి 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కాలపరిమితికి పెంచాలని కోరుతున్నామన్నారు.దీంతో మరింత ఉత్తమ ఫలితాలు సాధించగలమని వివరించారు.
పీఎం ప్రణామ్ కార్యక్రమంలో భాగంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించిన రాష్ట్రాలకు కేంద్రం ఇన్సెంటివ్ లను అందిస్తుందని, రసాయన ఎరువుల వాడకంలో గత రెండు వ్యవసాయ సీజన్ లలో తగ్గించిన కారణంగా మన రాష్ట్రంకు ఇన్సెంటీవ్ లు రానున్నాయని చైర్మన్ లంకా దినకర్ వివరించారు.దీనివల్ల ఇన్సెంటివ్ లు సుమార్ రూ. 300 కోట్లు వరకూ వస్తాని చెప్పారు.ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫైడ్ ఛైర్మన్ దత్ నేషనల్ ఫార్మింగ్ సర్టిఫికెట్ తీసుకోవడంలో రైతులు మరింత చైతన్యం కావాలని పిలుపునిచ్చారని ఈ సందర్భంగా లంకా దినకర్ తెలిపారు.కావున ప్రకృతి సేద్యాన్ని చేస్తున్న రైతులు అందరూ సర్టిఫికెషన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రకాశం డెయిరీని మళ్లీ పున:ప్రారంభించాలని వ్యవసాయ శాఖ ఎక్స్ అపిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరి బి.రాజశేఖర్ ను కోరడం జరిగిందన్నారు.2019-24 మధ్య గత ప్రభుత్వం అమూల్ కు కట్టబెట్టాలని చూడటంతో మేము సమర్థవంతంగా అడ్డుకోవడం జరిగిందని చైర్మన్ లంకా దినకర్ ఈసందర్భంగా గుర్తుచేశారు.
Prajavartha Online Telugu News