– తుఫాను లేదా అతిభారీ వర్షాలకు అవకాశం- అప్రమత్తంగా ఉండాలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి గురువారం ఆర్ డివో కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశాలున్నాయని, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతానికి రెడ్ ఎలర్ట్ ప్రకటించిందని, ఈ నెల 18, 19 తేదిల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపద్యంలో ఈ నెల 19 కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతి లేదని, ప్రజలు అర్థం చేసుకుని అధికారయంత్రాంగానికి సహకరించాలని, దూర ప్రాంతాల నుండి వచ్చి ఇబ్బందులు పడవద్దని అన్నారు. మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో టాంటాం వేయించి ప్రజలు అప్రమత్తం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. డివిజనులో సముద్రతీరానికి 10 కిలో మీటర్ల లోపు గల 84 గ్రామాల్లో సచివాలయం, మండల స్థాయి అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. పాండురంగ ఉత్సవాల్లో దేవాలయంలో పూజలు నిర్వహించుకోవచ్చని అన్నారు. బందరు మండల తాసిల్దారు డి. సునీల్ బాబు, పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.