మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ప్రమాదకర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు ప్రజలను అనుమతించడం లేదని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్దకు పలువురు అధికారులతో కలిసివెళ్లి వాతావరణ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా జె సి డాక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, ప్రచండమైన తుపాను చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని,ఇది శుక్రవారం వేకువజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిందన్నారు. దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, పుదుచ్చేరి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆమె వివరించారు. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పెద్ద పెద్ద సముద్ర కెరటాలు తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయన్నారు. ప్రతికూల వాతావరం పరిస్థితులు ఏర్పడిన కారణంగా ఈ నెల 19 వ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఏ ఒక్కరిని అనుమతించడం లేదని ఆమె చెప్పారు. భక్తులు దయతో అర్ధం చేసుకుని ఆధికారయంత్రాంగానికి సహకరించాలని, దూర ప్రాంతాల నుండి సముద్ర స్నానాలకు తరలివచ్చే భక్తులు మంగినపూడి బీచ్, కోడూరు మండలం హంసలదీవికి వెళ్ళవద్దని జెసి అభ్యర్ధించారు. కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలను సమీప ఆలయాలలో నిర్వహించుకోవాలని ఆమె సూచించారు. జాయింట్ కలెక్టర్ వెంట డ్వామా పి డి , మచిలీపట్నం ఎంపిడిఓ జి.సూర్యనారాయణ, మచిలీపట్నం ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి , మచిలీపట్నం తహశీల్ధార్ సునీల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …