-మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
-హైకోర్టులో “రిజిస్ట్రార్” ( కోర్టు కేస్ అండ్ మేనేజ్మెంట్ )పోస్టు సృష్టికి కూడా గ్రీన్ సిగ్నల్
-న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించినట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో న్యాయ శాఖకు సంబంధించిన రెండు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం లభించిన విషయాన్ని మంత్రి ఫరూక్ వెల్లడించారు.జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం, 2008 కింద నమోదయ్యే కేసులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేందుకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులను ఏర్పాటు చేయాలని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశించినట్లు ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడ, విశాఖలో ఎన్ఐఏ కేసుల విచారణ కోసం రెండు నోటిఫై చేసిన కోర్టులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.కాగా రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 20 ఎన్ఐఏ కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 19 కేసులు విశాఖపట్నంలోని 3వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టులో, విజయవాడలోని 2వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉందన్నారు.విశాఖలో ఎన్ఐఏ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పరిధిగా ఉండేలా విశాఖలో జిల్లా మరియు సెషన్స్ జడ్జి స్థాయిలో ఒక ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును ఏర్పాటు చేయడం అవసరమని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. విశాఖలో జిల్లా మరియు సెషన్స్ జడ్జి స్థాయిలో ఒక ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును ఏర్పాటు చేయడం, ఆ కోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పరిధిగా ఉండేలా నిర్ణయించడం, అలాగే దీనిని నిర్వహించడానికి ఒక స్పెషల్ జడ్జితో సహా మొత్తం 16 మంది సిబ్బందిని కేటాయించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందన్నారు.
హైకోర్టులో “రిజిస్ట్రార్” ( కోర్టు కేస్ అండ్ మేనేజ్మెంట్ )పోస్టు సృష్టికి కూడా గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో జిల్లా న్యాయమూర్తి స్థాయికి చెందిన, రెగ్యులర్ ప్రాతిపదికన రిజిస్ట్రార్ ( కోర్టు కేస్ అండ్ మేనేజ్మెంట్ )పోస్టు సృష్టికి కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిందని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. సుప్రీంకోర్టు సుమోటో రిట్ పిటిషన్ (క్రిమినల్)నెంబర్- 4/2021 లోని ఆదేశాలు, సుప్రీంకోర్టు ‘కేస్ ఫ్లో మేనేజ్మెంట్ కమిటీ’ చేసిన సిఫార్సుల మేరకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ‘స్టేట్ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కమిటీ’కి చెందిన న్యాయమూర్తులు రాష్ట్ర హైకోర్టులో జిల్లా న్యాయమూర్తి స్థాయికి సమానమైన ‘రిజిస్ట్రార్ (కోర్ట్ అండ్ కేస్ మేనేజ్మెంట్)’ పోస్టును సృష్టించాలని నిర్ణయించిన మేరకు ప్రభుత్వం రిజిస్ట్రార్ పోస్టు సృష్టికి ఆమోదం తెలపడం జరిగిందన్నారు. కొత్త పోస్టు ఏర్పడటం వల్ల జిల్లా న్యాయస్థానాలలో పెండింగ్ కేసులను తగ్గించేదుకు వీలు కలుగుతుందని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News