గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ

-వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడి
-సామాజిక ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పిల్లల జననాలు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం భవిష్యత్‌ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపే ప్రమాదముందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా స్థిరత్వానికి సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అది 1.5కు పడిపోయిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో పనిచేసే యువత సంఖ్య తగ్గి, పరిశ్రమలు, సేవలు, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కల్చరల్ సెంటర్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వీరు మాట్లాడారు. జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, ఇటలీతోపాటు పలు దేశాల్లో జననాలు తగ్గిపోవడంతో పిల్లలను కనేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు, గృహ సదుపాయాలు, పిల్లల సంరక్షణ, తల్లిదండ్రులకు సెలవులు, సంతాన సాఫల్య చికిత్సల్ని అక్కడి ప్రభుత్వాలు అందిస్తున్నాయని వివరించారు. జనాభా తగ్గితే యువ శ్రామికుల కొరత ఏర్పడుతుందని, మరోవైపు వృద్ధుల వైద్యం, పింఛన్లపై ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతుందని తెలిపారు. పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గడం, ఆవిష్కరణలు మందగించడం, ఆర్థిక వృద్ధి క్షీణించడం వంటి పరిణామాలు ఎదురవుతాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నడిపించే శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు పిల్లల నుంచే తయారవుతారని చెప్పారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనకు మానవ వనరులే ప్రధాన బలమన్నారు. అమరావతి నిర్మాణం, పారిశ్రామిక కారిడార్లు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, ఆధునిక తయారీ రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగాలంటే నైపుణ్యం కలిగిన యువత అవసరమని వివరించారు. ప్రతి గర్భధారణా సురక్షితంగా ఉండటం, ప్రతి తల్లికీ వైద్యం అందడం, ప్రతి బిడ్డా ఆరోగ్యంగా పెరగడం, మహిళలకు ఉపాధి–కుటుంబ జీవితం మధ్య సమతుల్యత కల్పించడం, యువ
తకు నైపుణ్యాలు అందించడం, వృద్ధులకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే జనాభా నిర్వహణ లక్ష్యమన్నారు.

గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయం

‘పిల్లలే సంపద’ విధానాన్ని అధికారుల స్థాయిలోనే ఖరారు చేయకుండా ప్రజల భాగస్వామ్యంతో రూపొందిస్తామని ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభలు నిర్వహించి వైద్యులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంస్థల సూచనలు తీసుకుంటామన్నారు.
ఇది వైద్య, ఆరోగ్య శాఖకు మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదని, అన్ని శాఖలు, సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాల్సిన ఉద్యమమని చెప్పారు. వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కేవలం వైద్యం అందించేవారే కాదని, రాష్ట్ర భవిష్యత్‌ జనాభా నిర్మాణంలో కీలక పాత్రధారులని పేర్కొన్నారు. రాష్ట్రంలో తగ్గుతున్న జననాలు, పెరుగుతున్న వృద్ధుల జనాభాతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం ‘పిల్లలే సంపద’ పేరుతో సమగ్ర జనాభా నిర్వహణ విధానంతో అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ సిద్ధమవుతుందని
ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చక్రధర్ బాబు వెల్లడించారు. జనాభా నియంత్రణకు లక్ష్యాలు నిర్దేశించే పాత విధానానికి బదులుగా.. కుటుంబం, తల్లీబిడ్డల ఆరోగ్యం, పిల్లల పెంపకం, మహిళల ఉపాధి, వృద్ధుల సంరక్షణను అనుసంధానం జరుగుతుంది అని చెప్పారు.
దేశంలో మధ్యస్థ వయస్సు 28.4 ఏళ్లు కాగా.. రాష్ట్రంలో వృద్ధాప్య ధోరణి వేగంగా పెరుగుతోందని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పనిచేసే వయసువారిపై వృద్ధుల సంరక్షణ భారం గణనీయంగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రెండు వారాలకు ఒకసారి వృద్ధులకు ప్రత్యేక వైద్య క్లినిక్‌లు నిర్వహించనున్నట్లు కమిషనర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వృద్ధాప్య వైద్య సదుపాయాలను గుర్తిస్తున్నామని, రెండో దశలో రాష్ట్రస్థాయి వృద్ధాప్య వైద్య అత్యుత్తమ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పిల్లలు, వృద్ధుల సంరక్షణకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని తయారు చేసేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఐదు జిల్లాల్లో ప్రత్యేక కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. శిశు సంరక్షకులుగా ఐదువేల మంది, వృద్ధుల సంరక్షకులుగా మరో ఐదువేల మంది చొప్పున ఏటా శిక్షణ ఇవ్వడం లక్ష్యమన్నారు. ప్రతి నెలా నాలుగో శనివారం నిర్వహించే గ్రామసభే ‘పిల్లలే సంపద’ అమలుకు ప్రధాన వేదికగా ఉంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *