-జగనన్న ఇళ్ల నిర్మాణానికి అనువుగా లే ఔట్లు : అధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా నిర్మించుకునేలా లే అవుట్ లు ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జగనన్న ఇళ్ల నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాలపై గురువారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లే అవుట్ లలో నిలిచిన వర్షపు నీరు కారణంగా ఇళ్ల నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండేందుకు లే అవుట్ లను మెరక చేయడమైనదన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతి గత వారం అతి కనిష్ట స్థాయిలో ఉండడం, నూజివీడు డివిజన్ పమిడిముక్కల మండలంలో గత వారం కేవలం 3 ఇళ్ళు, గన్నవరం మండలంలో 4, బాపులపాడు మండలంలో 3 ఇళ్ళు మాత్రమే పూర్తికావడంపై అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేసారు. ఇకనైనా అధికారులు తమ పనితీరును మెరుగుపరచుకోని, ఇళ్ల నిర్మాణ ప్రగతిని వేగవంతం చేయాలనీ ఆదేశించారు. జగనన్న ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక, సబ్సిడీ పై అందిస్తున్న ఐరన్, సిమెంట్ తదితర అంశాలు, ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రభుత్వ యంత్రంగం అందించే చేయూతను లబ్దిదారులకు తెలియచేసి, త్వరితగతిన ఇళ్ళు నిర్మించుకునేలా వాలంటీర్లు అవగాహన కలిగించాలన్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వాలంటీర్ కు రోజుకు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ లక్ష్యం : జిల్లా కలెక్టర్
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంను జిల్లాలో నూరు శాతం విజయవంతం చేయాలన్నారు. గ్రామ/వార్డ్ సచివాలయ పరిధిలోని వాలంటీర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఒకొక్క వాలంటీర్ తమ పరిధిలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద గుర్తించిన లబ్దిదారులను కలుసుకుని, ఆ పధకం యొక్క ఉద్దేశ్యం, ప్రయోజనాలను లబ్దిదారులకు తెలియజేయాలన్నారు. ఈ పధకంను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకుగాను వాలంటీరుకు రోజుకు ఒక లబ్దిదారునితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించేలా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. వాలంటీర్లు వారికీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ లు ఎల్.శివశంకర్, కె. మోహన్ కుమార్, శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రన్, మండల తహసీల్దార్ల, ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.