-నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులపై టీడీపీ నేతలు గూండాల మాదిరిగా దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తిరుపతిలోని ఓ ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమం కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై, ఇద్దరు కూటమి ప్రభుత్వ మంత్రుల సమక్షంలోనే దాడి జరిగిందనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ పాత్రికేయుల భద్రతకే భంగం కలిగే పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమన్నారు.
పాత్రికేయులపై దాడికి పాల్పడిన వారిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ గురుమూర్తి డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గురించి గొప్పలు చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో జరిగిన ఈ ఘటనపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News