విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గరికిన పైడి రాజు పిలుపునిచ్చారు. శనివారం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు పైడి రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా మత్స్యకారులందరికి, మత్స్య జాతికి ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తాను గత 20 సంవత్సరాలుగా సంఘ నాయకులతో కలిసి మత్స్యకార దినోత్సవాలు విజయవంతంగా జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలోని మత్స్యకారులందరూ ఐక్యమత్యంతో మత్స్యకార దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవాలని తద్వారా మత్స్యకారులలో చైతన్యం వెల్లువెత్తుతుందని ఆకాంక్షించారు. మత్స్యకారులకు అనుకూలంగాలేని జీవో నెంబర్ 217ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మారుమూల గ్రామాల్లో తాగునీటి వసతులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నామని అందువల్ల తమను ఎస్ టి జాబితాలో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేలా కృషి చేశారు. మత్స్యకారుల గ్రామాలలోకి, ప్రాంతాలలోకి వెళ్లి విద్య, ఆరోగ్య, సాంప్రదాయాలలోమార్పు వచ్చే విధంగా చైతన్యపరచటానికి శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో చిన్ని చిట్టిబాబు, చిలకలపూడి అమ్మన్న రాజా, సైకం రమేష్, సుదర్శన్, రమణయ్య, పీఠం ప్రసాద్, వాడవల్లి చక్రధర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …