-జూలై 25–26న ‘ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం’ – ఆగస్టు 8–9న ‘అమరావతి చిత్రకళా వీధి’
-కళాకారులు, రచయితలు, ప్రజలందరూ భాగస్వాములు కావాలి
-రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు.
విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ, నృత్య సంగీత కళాశాలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ దిశగా జూలై 25, 26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో ‘ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం’ ను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగు భాషను కేవలం మాట్లాడే భాషగా కాకుండా, భావితరాలకు వారసత్వంగా అందించే లక్ష్యంతో ఈ మహోత్సవాన్ని రూపొందించినట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ‘సూర్యోదయ సుప్రభాతం’ సంగీత కార్యక్రమం, ‘ఆమె మాట – అక్షర బాట’, కవి సమ్మేళనాలు, ‘అమ్మమ్మ కథల ముచ్చట్లు’, ‘నెక్స్ట్ జెన్ తెలుగు’ యువతతో చర్చలు, ‘నవస్వరం’ ప్యానెల్ డిస్కషన్లు, తపాలా శాఖ సహకారంతో పూర్తిగా తెలుగులో పోస్టుకార్డులు రాసే వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆగస్టు 8, 9 తేదీలలో గుంటూరు విద్యానగర్ రింగ్ రోడ్డులో ‘అమరావతి చిత్రకళా వీధి’ పేరుతో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది రాజమండ్రిలో 550 మంది కళాకారులతో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి 800 స్టాల్స్‌తో మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర చిత్రకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు స్వరాష్ట్రంలోనే విశాల వేదిక కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తేజస్వి పొడపాటి పేర్కొన్నారు.
జూలై 26 సాయంత్రం జరిగే తెలుగు మహోత్సవం ముగింపు సభకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ నిర్వహణలో జరిగేవి మాత్రమే కాకుండా, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, సాంస్కృతిక సంస్థలు, యువత, ప్రజలందరూ భాగస్వాములై తెలుగు సంస్కృతి పరిరక్షణకు తోడ్పడాలని తేజస్వి పొడపాటి పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News