-ఫిర్యాదులు రీ-ఓపెన్ కాకుండా అర్థవంతమైన, శాశ్వత పరిష్కారం చూపాలి
-అపరిష్కృత సమస్యల పరిష్కారానికే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులను అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా పరిశీలించి, రీ-ఓపెన్ అయ్యే పరిస్థితి లేకుండా శాశ్వత, అర్థవంతమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు ఫలితాలపై దృష్టి సారించాలని సూచించారు. ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు- సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి నాలుగు శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, నాలుగో విడత కార్యక్రమాన్ని శుక్రవారం పటమట ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ రోడ్డులోని నల్లూరివారి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులతో సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జూలై 3, 10, 17 తేదీల్లో నిర్వహించిన మూడు విడతల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో 241 అర్జీలు స్వీకరించగా, నాలుగో విడతలో 137 అర్జీలు అందాయని తెలిపారు. దీంతో నాలుగు విడతల్లో మొత్తం 378 అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదులు మళ్లీ రీ-ఓపెన్ అయ్యే పరిస్థితి రాకుండా నాణ్యమైన పరిష్కారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే నియోజకవర్గంలోని అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం లభించిందని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్న అధికారులను ఆయన అభినందించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ, ప్రజలకు తక్షణ పరిష్కారాలు అందించే సమర్థవంతమైన వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో నాలుగు విడతల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వీఎంసీ జోనల్ కమిషనర్ ప్రభు కుమార్, అడిషనల్ కమిషనర్ శకుంతల, వివిధ శాఖల జిల్లా అధికారులు, వీఎంసీ సిబ్బంది, వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News