-దేశవ్యాప్తంగా 4,925 ఆరోగ్య పరిశోధన ప్రాజెక్టులకు ఆమోదం – పరిశోధన సామర్థ్యాల విస్తరణకు కీలక చర్యలు…
-లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం.
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఆరోగ్య పరిశోధన రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం, వైద్య కళాశాలలు, పరిశోధనా సంస్థల్లో అత్యాధునిక పరిశోధన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, ప్రజారోగ్య సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం “ఆరోగ్య పరిశోధన ప్రోత్సాహం కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి” (Infrastructure Development for Promotion of Health Research) కేంద్ర రంగ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ మేరకు విజయవాడ లోక్‌సభ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మంత్రి సమాధానం ఇస్తూ ఈ కేంద్ర రంగ పథకం కింద మల్టీ ఈ యూనిట్లలో ఏర్పాటైన స్థానిక పరిశోధన సలహా కమిటీలు (Local Research Advisory Committees – LRACs) పరిశోధన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఆమోదిస్తున్నాయని తెలిపారు
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,925 పరిశోధన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. వీటిలో 1,796 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తికాగా, 1,801 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. మరో 1,282 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉండగా, 46 ప్రాజెక్టులు వివిధ కారణాలతో విరమించబడ్డాయి అని అన్నారు
కొనసాగుతున్న 1,801 పరిశోధన ప్రాజెక్టులలో 285 ప్రాజెక్టులు ఒక సంవత్సరం లోపు, 587 ప్రాజెక్టులు ఒకటి నుండి రెండు సంవత్సరాల మధ్య, 619 ప్రాజెక్టులు రెండు నుండి మూడు సంవత్సరాల మధ్య, 310 ప్రాజెక్టులు మూడు సంవత్సరాలకు పైగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
నిధుల అంశానికి సంబంధించి, ఈ పథకం పూర్తిగా కేంద్ర రంగ పథకం కావడంతో రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య పరిశోధన విభాగానికి కేటాయించిన నిధులను అవసరాలకు అనుగుణంగా MRUలు మరియు MRHRUలకు నేరుగా విడుదల చేసి పరిశోధన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపింది.
గత మూడు సంవత్సరాల కాలంలో (2023–24 నుండి 2025–26 వరకు) ఈ పథకం ద్వారా విశేష ఫలితాలు సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్స్ (MRUs) ద్వారా 1,100 పరిశోధన ప్రాజెక్టులు పూర్తికాగా, 687 శాస్త్రీయ పరిశోధనా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అదనంగా 16 కొత్త సాంకేతికతలు, ప్రక్రియలు, పేటెంట్లు అభివృద్ధి చేయబడ్డాయి లేదా క్లినికల్/ప్రజారోగ్య మార్గదర్శకాల రూపకల్పనలో వినియోగించబడ్డాయి.
అదేవిధంగా మోడల్ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్స్ (MRHRUs) ద్వారా 158 పరిశోధన ప్రాజెక్టులు పూర్తికాగా, 140 పరిశోధనా ప్రచురణలు వెలువడ్డాయి. వీటిలో 14 పరిశోధన ప్రాజెక్టులు క్లినికల్ విధానాలు, ప్రజారోగ్య విధానాల్లో మార్పులకు దోహదపడినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఆరోగ్య పరిశోధన సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి సమాధానంలో వెల్లడించారు. అందులో భాగంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 8 మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్లను “సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ (CoRE)”గా ఉన్నతీకరించడం జరిగింది. అదనపు నిధులు, ఆధునిక ప్రయోగశాల పరికరాలు, నిపుణుల మానవ వనరులు అందించడం ద్వారా ఈ కేంద్రాలను అత్యాధునిక పరిశోధనలకు అనువుగా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
అలాగే దేశంలో 5 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొత్త మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్లు (MRUs) ఏర్పాటు చేసి పరిశోధన అవకాశాలను మరింత విస్తరించినట్లు తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించేందుకు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS)కు అనుబంధంగా MRHRU ఉప పథకం కింద వార్షిక జనాభా ఆధారిత ఆరోగ్య సర్వేను ప్రారంభించడం మరో కీలక కార్యక్రమంగా పేర్కొంది. దీని ద్వారా స్థానిక ఆరోగ్య సమస్యలను గుర్తించి శాస్త్రీయ ఆధారాలతో విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పరిశోధనకు చారిత్రాత్మక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పరిశోధన మౌలిక సదుపాయాల విస్తరణ, వైద్య కళాశాలల్లో పరిశోధన సంస్కృతికి ప్రోత్సాహం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, గ్రామీణ ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశ ఆరోగ్య రంగంలో గుణాత్మక మార్పులు తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆరోగ్య పరిశోధన, వైద్య విద్య, ప్రజారోగ్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మరిన్ని పరిశోధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ప్రాజెక్టులు అందేలా తాను నిరంతరం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నానని తెలిపారు. రాష్ట్ర యువ వైద్యులు, పరిశోధకులు, వైద్య విద్యార్థులు ప్రపంచస్థాయి పరిశోధన అవకాశాలు పొందేలా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు
Prajavartha Online Telugu News