జగనన్నసంపూర్ణ గృహహక్కు పధకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

-డిశంబరు 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ప్రారంభం
-39.7లక్షల మంది ఋణగ్రహీతలు,12.1లక్షల మంది ఇతర(నాన్ లోనీ)లబ్దిదారులకు ప్రయోజనం
-ఈపధకంతో లబ్దిదారు స్థిరాస్థిని గ్రామ సచివాలయంలోనే రిజిష్టర్ చేసుకోవచ్చు
-పధకంపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ప్రజాప్రతినిధులు కృషిచేయాలి
-ముఖ్యంగా మండల,మున్సిపల్ సమావేశాల్లో పెద్దఎత్తున చర్చించాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వచ్చేనెల నుండి అమలు చేయనున్నజగనన్నసంపూర్ణ గృహ హక్కు పధకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అందరు ప్రజాప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ,మున్సిపల్ శాఖామాత్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు,బొత్స సత్యనారాయణలు విజ్ణప్తి చేశారు.గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో అసెంబ్లీ విరామ సమయంలో జగనన్నసంపూర్ణ గృహ హక్కు పధకంపై ముఖ్యంగా ఏకకాల పరిష్కారం(ఒన్ టైం సెటిల్మెంట్)పై మంత్రులు,ఎంఎల్ఏలు,ఎంఎల్సిలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా గృహనిర్మాణ శాఖమంత్రి శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ డిశంబరు 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్నసంపూర్ణ గృహ హక్కు పధకాన్ని రాష్ట్రంలో ప్రారంభించనున్నారని చెప్పారు.ఆలోగా ఈపధకంపై అందరు ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.ఒన్ టైం సెటిల్మెంట్ అనేది కొత్తది కాదని ఇది గతంలో కూడా అనగా 2000 నుండి 2104 వరకూ కూడా)అమలు చేయ బడిందని తెలిపారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు పేరిట 25లక్షల ఇళ్లు నిర్మించడం జరిగిందని చెప్పారు.గతంలో ప్రభుత్వం ఎవరికైతే డబ్బులిచ్చి ఇళ్లు కట్టించిందో వారికే ఈజగనన్న సంపూర్ణ గృహహక్కు పధకం ఒన్ టైం సెటిల్మెంట్ వర్తిసుందని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఏదో డబ్బులు కోసం ఈఒన్ టైం సెటిల్మెంట్ ను అమలు చేస్తోందని అపోహ పడడం ఎంత మాత్రం వాస్తవం కాదని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో గ్రామీణ,పట్టణ స్వయం సహాయక సంఘాల్లో అధిక సంఖ్యలో మహిళలు సభ్యులుగా ఉన్నారని వారందరిలో దీనిలో పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అదిశగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.మండల,మున్సిపల్ సమావేశాల్లో కూడా ఈపధకంపై విస్తృతంగా చర్చించి ప్రజలందరికీ అవగాహన కలిగేలా చూడాలని,నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరికీ ముఖ్యంగా ఆయా లబ్దిదారులకు విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున కృషి చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సహచర మంత్రులు,ఎంఎల్సి,ఎంఎల్ఏలకు విజ్ణప్తి చేశారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి ఈజగనన్నసంపూర్ణ గృహ హక్కు పధకంతో ప్రయోజనం కలగనుందని చెప్పారు.పేదవాడి స్వంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున గృహ వసతిని కల్పించడం జరుగుతోందని కావున ప్రజలకు దీనిపై పూర్తి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు.
గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంలో యూజర్ చార్జీలు,రిజిష్ట్రేషన్ చార్జీలు,స్టాంపు డ్యూటీలకు నూరుశాతం మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.అదే విధంగా రిజిష్ట్రేషన్ కోసం రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లోనే ఆప్రక్రియను చేయించుకోవచ్చని తెలిపారు.అంతేగాక ఈ రిజిష్టర్ డాక్యుమెంట్ తో బ్యాంకు ఋణాలను కూడా పొందేందుకు అన్నివిధాలా అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
డిశంబరు 21 నుండి ప్రారంభం కానున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం విశేషాలు:
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద రాష్ట్రంలో మొత్తం 51లక్షల 8వేల మంది లబ్ధిదారులు ఉండగా వారిలో 39.7లక్షల మంది ఋణం గ్రహీతలు,12.1లక్షల మంది ఇతరులు(నాన్ లోనీ)ఉన్నారు.10 సంవత్సరాలకు ముందు రుణము లేదా పట్టా పొంది, ఋణ గ్రహీత లేక పట్టాదారు లేక వారి వారసులు అనుభవంలో ఉన్నవారికి ఈ పధకం వర్తిస్తుంది.ఈపధకం ప్రయోజనాలు ఏమంటే నియమిత రుసుము చెల్లించి పూర్తి ఋణ మాఫీ పొందవచ్చును.అలాగే లబ్ధిదారుడు తన ఇంటిపై సర్వ హక్కులు పొందవచ్చును.లబ్ధిదారుడు తన రిజిస్ట్రేషన్ పత్రంతో బ్యాంకులు నుండి ఋణం పొందేందుకు,తనఖా పెట్టుకునేందుకు, అమ్ముకునేందుకు,లేదా బహుమతిగా ఇచ్చేందుకు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్ చేసుకోవచ్చును.అలాగే రిజిస్ట్రేషన్ కు ఎలాంటి డ్యూటీ ఫీజును చెల్లించనవసరం లేదు.భూమి విలువపై 7.5శాతం రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ ఉంటుంది. విలువపై నూరు శాతం యూజర్ ఫీజు మాఫీ ఉంటుంది.ఈపధకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏవిధమైన లింక్ డాక్యుమెంట్ అవసరం లేదు.లబ్దిదారునికి చెందిన స్థిరాస్తిని గ్రామ సచివాలయంలో రిజిష్టర్ చేసుకోవచ్చును.రిజిష్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు.లబ్ధిదారుడి స్థిరాస్తిని 22(ఎ)నిబంధన నుండి తొలగించ బడుతుంది.దానివల్ల లబ్ధిదారుడు ఏవిధమైన లావాదేవీలైనా చేసుకోవచ్చును. రిజిష్ట్రషన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.నామ మాత్రపు రుసుముతో గ్రామ సచివాలయంలో రిజిష్ట్రేషన్ చేయించుకోవచ్చును.
గ్రామీణ ప్రాంతాల్లో 10వేల రూ.లు,మున్సిపాలిటీల్లో 15వేల రూ.లు,మున్సిపల్ కార్పొరేషన్ లలో 20వేల రూ.లు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ వడ్డీ మరియు అసలు పై తెలిపిన రుసుము కంటే తక్కువ ఉన్నచో తక్కువ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. గతంలోని ఏకకాల పరిష్కారానికి (ots) ప్రస్తుత పధకానికి మధ్య ఉన్న తేడా 2000వ సం.రం.నుండి 2014 వరకూ ఓటిఎస్ అమలులో ఉంది.2014 నుండి ఇప్పటి వరకు ఒక్క లబ్దిదారునికి కూడా ఓటిఎస్ అమలు కాలేదు.అంతేగాక లబ్దిదారు ఋణం చెల్లించి నప్పటికీ ఏవిధమైన రిజిష్టర్ పట్టా ఇచ్చేవారు కాదు.అంతేగాక టైటిల్ డీడ్ కూడా ఇచ్చేవారు కాదు.ప్రస్తుత జనగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ద్వారా ఋణం చెల్లించిన రశీదు చూపించిన వెంటనే స్థిరాస్థికి సంబంధించిన పట్టా ఇవ్వబడుతుంది.అలాగే గతంలో వడ్డీని మాత్రమే మాఫీ చేసేవారు,కాని ఈపధకం ద్వారా ప్రాంతాన్ని బట్టి నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.గతంలో మండల కేంద్రంలో గల గృహనిర్మాణ శాఖ కార్యాలయానికి వెళ్లవల్సి వచ్చేది,ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లోనే ఈపధకం ప్రయోజనాలు పొందవచ్చును. ఈపధకానికి సంబంధించిన మొత్తం పనులన్నీ గ్రామ సచివాలయాల్లోనే అనగా లబ్దిదారుల గుర్తింపు,స్థిరాస్థికి చెందిన కొలతలు,రుసుం చెల్లింపు,ఋణం చెల్లింపు వంటి పనులన్నీ జరుగుతాయి.
ఈకార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్,అంజాద్ బాషా,ఇతర మంత్రులు సీదిరి అప్పల రాజు,ముత్తంశెట్టి శ్రీనివాస్,వెల్లంపల్లి శ్రీనివాస్,కొడాలి నాని,పినిపే విశ్వరూప్,ఆదిమూలపు సురేశ్,కురసాల కన్నబాబు,సిహెచ్ శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, తానేటి వణిత,గృహ నిర్మాణ సంస్థ అధ్యsక్షులు దొరబాబు,ఆశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే,గృహనిర్మాణ సంస్థ ఎండి నారాయణ భరత్ గుప్తా,ఇడి కమలాకర్ బాబు,సిఇ శ్రీరాములు,పలువురు ఎంఎల్ఏలు,ఎంఎల్సిలు,అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *