రైతన్నల సాగు బడి – పొలం బడి…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమమే దేశ సంక్షేమం. ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతన్న కు సాగులో మెళకువలు, సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు, పంటకు చీడపీడలు ఆశించకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు వివరించి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట అధిక దిగుబడి సాదించేందుకు రైతును సమాయత్తపరచడమే “పొలంబడి” కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రయోగశాలల్లోని ఫలితాలు క్షేత్రస్థాయిలోని రైతులకు అందించడమే పొలంబడి ప్రధాన లక్ష్యం వివిధ రకాల పంటలకు అనువైన భూమి, దానికి ఉండే నీటి వనరులు, విత్తన శుద్ధి, నాణ్యమైన పంట, అధిక దిగుబడి అందించే మిత్ర పురుగులు, పంటను నాశనం చేసి శత్రు పురుగులు మరియు ఆ పొలం చుట్టూ ఉన్న వాతావరణం, అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందుల వాడకం కారణంగా కలిగే నష్టాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందే సేవలు. లాంటి అన్ని విశ్లేషించి పొలంబడి ద్వారా వివరించడం జరుగుతుంది. పొలంబడి 14 వారాల కాలపు విలక్షణ కార్యక్రమం. మొదటి సమావేశం, మొలక వెదజల్లడం లేదా నాట్లు వేయడంతో మొదలై పంటకోతల వరకు కొనసాగుతుంది. పొలంబడి కి ముందు పంట ఎంపిక, గ్రామ సమావేశ నిర్వహణ, రైతుల నమోదు.ప్రాధమిక సర్వే ,లోపాలను గుర్తించుట, మట్టినమూనాల సేకరణ, విత్తనాల మొలకెత్తింపు పరీక్ష, నీటి నిల్వ సామర్థ్యం పై సులభ ప్రయోగాలు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారు. పొలంబడి ద్వారా అన్ని రకాల పంటల పూర్తి సాగు విధానాలను అందులోని మెళుకువలను రైతులకు తెలియజేసి, రైతులలో నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ అందిస్తారు. వరి, వేరుశనగ, చిరుధాన్యాలు, అపరాలు, మొక్కజొన్న, గోధుమ మొదలగు పంటలన్నింటి యొక్క సమగ్ర పోషకాలు, ఎరువులు, కలుపు, నీరు, సస్యరక్షణ మరియు తెగుళ్ళు నివారణ వంటివి ఖరీఫ్ లో ఎలా ఉంటుంది, రబీలో ఎలా ఉంటుందో పూర్తిగా తెలియజేస్తారు. హానికరమైన రసాయన కీటక నాశీనులు బదులుగా వృక్ష మరియు జీవ సంబంధమైన కీటక నాశీనులు ఎలా వాడాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, దానివలన కలిగే లాభాలు ఏమిటి అనే విషయాలను వివరిస్తారు. పంట మొక్కల ఆరోగ్య పరిస్థితులను ఎలా గమనించాలి, మొక్కలో ఏదైనా పోషక లోపాలు ఉన్నాయా, తెగుళ్ళు ఉన్నాయా వంటి తదితర విషయాలు క్షుణ్ణంగా నేర్పడం జరుగుతుంది.
మిత్ర పురుగుల సంరక్షణలో భాగంగా వాటి వల్ల కలిగే లాభాలు, వాటి రక్షణ వంటివి నేర్పుతారు. చీడ, పీడలు నివారణలో భాగంగా క్రిమికీటకాలు, తెగుళ్ళు వాటి నివారణ చర్యలు వంటివి వివరించడం జరుగుతుంది. ఈ విధానం లో వివిధ పంటల సాంకేతిక పద్దతులు, సమస్యాత్మక వ్యవసాయానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడం, వ్యవసాయానికి సంబంధించి వివిధ పథకాలను ఏ విధంగా వినియోగిచుకోవాలో తెలియచేయడం మరియు రైతుకు , పరిశోధకులకు మధ్య వారధిగా వ్యవహరించడం వంటి విధివిధానాలు పొలంబడి లో భాగంగా ఉంటాయి.
వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి గ్రామ స్థాయిలో పటిష్ట వ్యవస్థను రూపొందించింది. సచివాలయ వ్యవస్థలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబందించి వ్యవసాయ, ఉద్యానవనాలు, మత్స్య శాఖల సిబ్బందిని నియమించింది. వీరు సచివాలయాల పరిధిలోని రైతులకు పొలంబడి కార్యక్రమం ద్వారా పొలంవద్దే నూతన వ్యవసాయ పద్ధతులతో కొత్త విజ్ఞానాన్ని అందించి వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. గ్రామ సచివాలయాలు పరిధిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి, విత్తనం నాటే దగ్గర నుండి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతుకు అన్ని విషయాలలో సహకారం అందిస్తున్నది. పల్లెర్లమూడి గ్రామానికి చెందిన రైతు యనమదల స్వామి మాట్లాడుతూ తమ గ్రామంలో పొలంబడి కార్యక్రమంను వ్యవసాయాధికారులు నిర్వహించారని, సాగులో ఉత్తమ యాజమాన్య పద్దతులను తెలియజేసి అధిక దిగుబడికి సహకరించారన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కలిగించడమే కాకుండా వాటిని వినియోగించేలా చేశారన్నారు. యనమదల గ్రామానికి చెందిన చిమట వడ్డీకాసులు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాల దగ్గర నుండి, ఎరువులు, పురుగుమందులు, పండిన పంటకు మార్కెటింగ్ సౌకర్యాలు, వంటి ఎన్నో సేవలు అందుతున్నాయన్నారు. వ్యవసాయ అధికారులు పొలంబడులు నిర్వహించి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల తయారీ, వాడకం, చీడపీడల నిర్ములన, మిత్ర పురుగుల సంరక్షణ, మొదలైన విషయాలపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారన్నారు. మండల వ్యవసాయాధికారి శ్రీమతి చాముండేశ్వరి మాట్లాడుతూ నూజివీడు మండలంలోని అన్ని గ్రామాలలోనూ పొలంబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతుల పొలాలవద్దకు వెళ్లి సేంద్రియ ఎరువుల వినియోగం, చీడపీడల నిర్ములన, ఉత్తమ యాజమాన్య పద్దతులపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. రైతే రాజు అనే పదాన్ని నిజం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతన్నకు అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా మార్చింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *