Breaking News

తూర్పుగోదావరి జిల్లా డీపీఆర్వో పెద్దింటి రవికి ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో)గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన పెద్దింటి రవికి పదవీ విరమణ వీడ్కోలు సభను సోమవారం రాజమహేంద్రవరం లోని వైటీసీ ప్రాంగణంలో ఉన్న డీఐపీఆర్వో కార్యాలయంలో ఆత్మీయుల మధ్య నిర్వహించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని రవి సేవలను కొనియాడారు.

నిబద్ధత, స్థితప్రజ్ఞతతో విధుల నిర్వహణ
– డి ఐ పిఆర్వో కె.లక్ష్మీ నారాయణ
ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సమాచార పౌర సంబంధాల శాఖలో 39 సంవత్సరాల 6 నెలల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో పెద్దింటి రవి వివిధ హోదాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి విశేష సేవలందించారని ప్రశంసించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు, మీడియాకు సమర్థవంతంగా చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
విధి నిర్వహణలో ఎటువంటి ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా స్థితప్రజ్ఞతతో, సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించడం రవి ప్రత్యేకత అని పేర్కొన్నారు. సహచరులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, కార్యాలయ విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, తన అనుభవాన్ని జూనియర్ సిబ్బందికి అందిస్తూ వారికి మార్గనిర్దేశం చేశారని కొనియాడారు. ఆయన సేవలు శాఖకు చిరస్మరణీయమని అన్నారు.

మీడియా అక్రెడిటేషన్ విధుల్లో విశేష అనుభవం
డివిజనల్ పిఆర్వో ఎం. లక్ష్మణా చార్యులు మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు మీడియా అక్రెడిటేషన్‌కు సంబంధించిన విధులను విజయవంతంగా నిర్వహించిన తీరు ఆయన పనితీరుపై ఉన్నతాధికారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అక్రెడిటేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఆయనకు ఉన్న అనుభవం ప్రత్యేకమైనదని అన్నారు. మారుతున్న మీడియా పరిస్థితులకు అనుగుణంగా విధులను నిర్వహిస్తూ, శాఖ–మీడియా మధ్య సత్సంబంధాలను కొనసాగించడంలో రవి అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

కృతజ్ఞతలు తెలిపిన డిపిఆర్వో పెద్దింటి రవి
ఈ సందర్భంగా డీపీఆర్వో గా పదవీ విరమణ చేసిన పెద్దింటి రవి మాట్లాడుతూ.. తన ఉద్యోగ ప్రస్థానంలో అండగా నిలిచి ఆదరించి, ప్రోత్సహించిన ఉన్నతాధికారులకు, సహాయ సహకారాలు అందించిన సహోద్యోగులకు, మీడియా మిత్రులకు, కష్టసుఖాల్లో వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
39 సంవత్సరాల 6 నెలల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానం ఒక ఎత్తయితే, ఈ కార్యాలయంలో పనిచేసిన కాలం తన జీవితంలో ఒక మరుపురాని అనుభూతిని అందించిందని పేర్కొన్నారు. సహచరులు, మీడియా మిత్రులు, అధికారులతో ఏర్పడిన మధురానుబంధాన్ని చిరకాలం కొనసాగిస్తానని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కూడా అందరి ఆదరాభిమానాలు, ఆత్మీయత కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డివిజనల్ పిఆర్వో ఎం. లక్ష్మణా చార్యులు, సహాయ సమాచార ఇంజనీర్ కె. శాంతకుమారి, లైబ్రేరియన్ బషీర్, సిబ్బంది మనోహర్, వర్మ, పద్మ, రమణ, జానీ, దుర్గారావు, భవానీ, బుల్లియమ్మ, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *