-రాబోయే 20 ఏళ్లలో ఏపీ పచ్చగా కళకళలాడుతుంది
-పిల్లలకు మొక్కలు నాటడం, పెంపకం అలవాటు చేయాలి
-చిలకలూరిపేట ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్ స్కూలులో ‘వన క్షేమం – జన క్షేమం’ కార్యక్రమంలో మొక్కలు నాటి, ప్రసంగించిన ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదల నాగబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘పెద్ద బాలశిక్షలో చెప్పినట్లు… పది బావులు ఒక చెరువులతో సమానం. పది చెరువులు ఒక మంచి నీటి సరస్సుతో సమానం. పది సరస్సులు ఒక బిడ్డతో సమానం. అలాంటి పది మంది ఉత్తమ బిడ్డలతో సమానం ఓ చెట్టు. పర్యావరణంలో వచ్చే మార్పులను, మన జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలను పెంచే గొప్ప శక్తి చెట్లకు ఉంద’ని ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం ఇవ్వడానికి సమష్టిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణలో పాలు పంచుకుందాం అని పిలుపునిచ్చారు. చిలకలూరి పేటలోని ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్ హైస్కూలులో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ‘వన క్షేమం – జన క్షేమం’ కార్యక్రమంలో భాగంగా నాగబాబు ఆధ్వర్యంలో స్కూలు పిల్లల సమక్షంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ ‘‘సమాజానికి ఏదైనా చేయాలనే తపతో మొక్కలను పెంచడం, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలను చిన్నారులకు ఎన్నో విషయాలు చెప్పేవాడిని. నా మీద నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తూ రాష్ట్రం పచ్చగా కళకళలాడేలా చేయాలన్నదే నా లక్ష్యం. బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి అధికారిక కార్యక్రమం చిన్నారులతో చేయడం ఆనందంగా ఉంది.
* చెట్టుఅనేది మన జీవితంలో భాగం కావాలి
ఇల్లు నచ్చకపోతే వేరు ఇంటికి వెళ్లిపోతాం. ఓ ఊరు నచ్చకపోతే వేరే ఊరికి వెళ్లిపోతాం. అది నచ్చకపోతే దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం ఉంది. కానీ మొత్తం ప్రపంచమే నాశనం అయితే మానవాళికి మరో చోటు లేదు. గ్రహం లేదు. మనం ఇక్కడే ఉండాలి. ఉంటున్న చోటునే అందంగా, స్వచ్ఛంగా చేసుకోవాలి. దానికి మనమంతా కృషి చేయాలి.
ప్రస్తుత తరానికి మా జనరేషన్ సారీ చెప్పాలి. విచక్షణరహితంగా పర్యావరణాన్ని ధ్వంసం చేసి మా తరం ఈ తరానికి అన్యాయం చేసింది. స్వార్థపూరిత మనుషులు ఎక్కువై చెట్లను కొట్టేశాం. చెట్టు అనేది మన జీవితంలో భాగం కావాలి. అవి మన జీవితాన్ని అత్యున్నతంగా కొనసాగించే మార్గాలు. మేం చిన్నపుడు చెట్ల కిందనే ఆడుకునే వాళ్లం.. వేసవిలో కూడా మాకు భయం లేకుండా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అయితే ఈ తరం వారు మళ్లీ ప్రేమతో మొక్కలను నాటుతున్నారు. వాటిని సంరక్షిస్తున్నారు. ఈ ప్రేరణ అందరిలోనూ రావాలి. జెన్ అల్ఫా, జెన్ బీటా తరం పెరిగి పెద్దయ్యాక పచ్చటి వాతావరణం ఇవ్వడానికి మేం కూడా తగిన విధంగా సహకరిస్తాం.
• ఒక మొక్క విలువ రూ.3 కోట్లు
మొక్కలను పెంచడం వల్ల ఏమొస్తుందిలే అనుకోవద్దు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఏ మొక్క నాటినా అది పెరిగి చెట్టుగా మారితే ఇచ్చే ఫలాలు చిన్నవే కావొచ్చు.. పెద్ద లాభం ఏముందిలే అనుకోవచ్చు.. కానీ చెట్లు ఇచ్చే ఆక్సిజన్, పీల్చుకునే కార్బన్ డై ఆక్సైడ్, భూమిని సారవంతం చేయడానికి అది చేసే మేలును లెక్కిస్తే రూ.2 నుంచి కోట్ల సంపద ఇచ్చినట్లు అనుకోవాలి. చెట్టును చులకనగా చూడొద్దు. బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించే వారంతా మొక్కలను నాటాలి. పిల్లలకు మొక్కలు నాటడం, వాటి సంరక్షణ అలవాటు చేయాలి. రాబోయే 20 ఏళ్లలో చక్కటి హరితహారంగా ఆంధ్రప్రదేశ్ తయారు అవుతుంది. దీనికి ప్రభుత్వం తగిన విధంగా సహకరిస్తుంది’’ అని అన్నారు.
ఈ సమావేశంలో చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్ హైస్కూలు కరస్పాండెంట్ మైలవరపు శివానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News