విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరాశానిస్పృహలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మానసిక ప్రశాంతతకు ధ్యానం ఒక్కటే మార్గమని బియాండ్ యువర్ మైండ్ గ్లోబల్ ఫౌండేషన్ (ఆస్ట్రేలియా) వ్యవస్థాకురాలు, ఇంజినీర్ గుళ్లపల్లి సరోజ అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బుధవారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ధ్యానం అంశంపై ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలో సవాళ్లు ఎక్కువని, విద్యాలయాల్లో మానసిక ఆందోళన పెరుగుతోందని, 41 రోజుల పాటు ధ్యానం చేసేవారికి మానసిక వ్యాకులత ఉండదన్నారు. మానసిక ప్రశాంతతతోనే జీవితంలో మెరుగైన ఫలితాలు సాధించగలమని ఆమె చెప్పారు. జీవితం ఆనంద ప్రయాణంగా సాగాలని, ఏరి కోరి సమస్యలు తెచ్చుకోకూడదన్నారు. విదేశాల్లో ఐదేళ్ల పిల్లలు కూడా ధ్యాన తరగతులకు హాజరవుతున్నారని, తమ సంస్థ బియాండ్ యువర్ మైండ్ మెరుగైన సమాజం కోసం 18 రకాల ఉచిత సేవలు అందిస్తోందని సరోజ పేర్కొన్నారు. డీన్ ఆచార్య రాజేష్ సి జంపాల మాట్లాడుతూ ప్రస్తుత తరం స్ట్రెస్ జనరేషన్ గా కనబడుతోందని, ప్రశాంతచిత్తం లేకపోవడం వల్లే భారతదేశం క్యాన్సర్, షుగర్, గుండె రోగాల కేంద్రంగా, అనారోగ్యకర దేశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యక్షులు వెల్లంకి నాగభూషణం, వెల్లంకి లలిత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. మనోరంజని, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ప్రొ. రాజేష్ సి.జంపాల ముఖ్య అతిథి సరోజను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సరోజ పి.జి. విద్యార్థులతో ధ్యానముద్రలు చేయించారు.
Prajavartha Online Telugu News