-ఎన్‌టీఆర్ జిల్లాలో కంటెంట్ క్రియేషన్ అకాడమీ, స్టూడియో ఏర్పాటుపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష
-యువత, మహిళలకు సృజనాత్మక రంగంలో ఉపాధి అవకాశాలు.. పర్యాటక, సాంస్కృతిక వైభవానికి డిజిటల్ ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సృజనాత్మకత, డిజిటల్ మీడియా, సాంస్కృతిక రంగాలను ఆర్థికాభివృద్ధితో అనుసంధానిస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ (Orange Economy) అభివృద్ధికి ఎన్‌టీఆర్ జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. గురువారం విజయవాడలోని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా సంబంధిత అధికారులతో మంత్రి సమావేశమై కంటెంట్ క్రియేషన్ స్టూడియో, కంటెంట్ క్రియేషన్ అకాడమీ, కంటెంట్ ల్యాబ్ ఏర్పాటుపై చర్చించారు.
సృజనాత్మకత, సాంకేతికతను పర్యాటకం, సంస్కృతి, ఉపాధితో అనుసంధానించడం ద్వారా యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత డిజిటల్ ప్రచారం కల్పించవచ్చని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
* ఆరెంజ్ ఎకానమీకి ప్రోత్సాహం
మీడియా, డిజైన్, కథనం, కళలు, సంస్కృతి, వారసత్వం, డిజిటల్ కంటెంట్ వంటి సృజనాత్మక రంగాలకు ఆర్థిక విలువను జోడించడమే ఆరెంజ్ ఎకానమీ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఈ రంగంలో యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలుగా మలచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ ఈ దిశగా కీలక వేదికగా నిలుస్తాయని తెలిపారు. ప్రొఫెషనల్ స్థాయిలో వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, లైవ్ స్ట్రీమింగ్ తదితర సదుపాయాలతో స్టూడియోను వినియోగించుకోవచ్చని, అకాడమీ ద్వారా కంటెంట్ తయారీ, వీడియో చిత్రీకరణ, ఎడిటింగ్, కథనం, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగం వంటి అంశాల్లో శిక్షణ అందించవచ్చని చెప్పారు.
* విజయవాడ పర్యాటకానికి డిజిటల్ ప్రచారం
విజయవాడతో పాటు ఎన్‌టీఆర్ జిల్లాలోని పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలను వీడియోలు, రీల్స్, డాక్యుమెంటరీలు, ఇతర డిజిటల్ కంటెంట్ రూపంలో విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం, నదీతీరం, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, స్థానిక సంస్కృతి తదితర ప్రత్యేకతలను ఆధునిక డిజిటల్ వేదికల ద్వారా దేశ, విదేశీ పర్యాటకులకు చేరువ చేయడం ద్వారా పర్యాటక రంగానికి మరింత ఊతమివ్వవచ్చన్నారు.
* మన సంస్కృతి.. మన వారసత్వానికి డిజిటల్ భద్రత
జిల్లాలోని జానపద కళలు, సంప్రదాయాలు, పండుగలు, స్థానిక వంటకాలు, కళాకారుల ప్రతిభను డిజిటల్ రూపంలో డాక్యుమెంట్ చేసి భద్రపరచాలని మంత్రి తెలిపారు. దీనివల్ల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే డిజిటల్ సాంస్కృతిక ఆర్కైవ్ను రూపొందించే అవకాశం ఉంటుందన్నారు.
* ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఎన్‌టీఆర్ జిల్లా
కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ, ల్యాబ్‌లను సమర్థవంతంగా వినియోగిస్తూ సాంకేతికత, సృజనాత్మకత, పర్యాటకం, సంస్కృతి, ఉపాధిని ఒకే వేదికపైకి తీసుకురావాలని మంత్రి సూచించారు. ఎన్‌టీఆర్ జిల్లాలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్‌లో ఇతర జిల్లాల్లోనూ అమలు చేయగలిగే రిప్లికబుల్ మోడల్‌గా అభివృద్ధి చేయాలని అన్నారు.
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్శివనాథ్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, గ్రామీణ యువతకు కంటెంట్ క్రియేషన్‌లో శిక్షణ ఇచ్చి వారి ప్రతిభను ఆదాయ వనరులుగా మార్చేందుకు ఈ కంటెంట్ ల్యాబ్ దోహదపడుతుందన్నారు. స్థానిక ప్రాంతాల పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, స్థానిక వంటకాలు, జానపద కళలు తదితర అంశాలపై నాణ్యమైన డిజిటల్ కంటెంట్ రూపొందించడం ద్వారా ‘లోకల్ టాలెంట్ – లోకల్ ఇన్‌కమ్’కు మార్గం సుగమం చేయవచ్చన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా మాట్లాడుతూ కంటెంట్ ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన సుమారు రూ.10 లక్షల నిధులను జిల్లా పర్యాటక మండలి ద్వారా సమకూర్చినట్లు మంత్రికి వివరించారు. ఆర్‌టీఐహెచ్ (RTIH), పీ4 మార్గదర్శకుల సహకారంతో కంటెంట్ ల్యాబ్ రూపకల్పన, అమలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా రెవెన్యూ అధికారి జి.లక్ష్మీ నరసింహo, ఆర్డిఓ వెన్నెల శ్రీను, డిపిఆర్ఓ టి.నాగేశ్వరరావు, డిఇఓ, పర్యాటక శాఖ, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News