-ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
-ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందితే పేదలకు ఆర్థిక భారం తప్పుతుంది
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిలో పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్, ల్యాబొరేటరీ, ఓపీ విభాగం, ఆబా జనరేషన్స్, వివిధ వార్డులు, ఇతర వైద్య విభాగాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, పరీక్షలు, వైద్యుల అందుబాటు తదితర అంశాలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రి పనితీరులో క్యూఆర్ స్కాన్ వినియోగం తదితర అంశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవలను సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా వైద్యులతో మాట్లాడుతూ పేద, బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించినప్పుడే వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, తగిన వైద్యం అందకపోతే పేదలు తప్పనిసరిగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని, తద్వారా వారు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సమర్థవంతమైన, నాణ్యమైన, మానవతా దృక్పథంతో కూడిన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. పేదలకు వైద్య సహాయం అందించడం ఎంతో గొప్ప విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులుగా పేద ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోగులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని అవసరమైన వైద్య సేవలను అందించాలని తెలిపారు. వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి లోపల, బయట పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది బాధ్యత అని పేర్కొన్నారు. వార్డులు, రోగుల విశ్రాంతి ప్రదేశాలు, మరుగుదొడ్లు, ఆసుపత్రి ప్రాంగణం తదితర ప్రాంతాల్లో నిరంతరం పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి హాజరై రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా విధుల్లో సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, మందులు, వైద్య పరికరాలు తదితర ప్రయోజనాలు పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.హరికృష్ణ, వివిధ విభాగాల వైద్యులు డాక్టర్ హరి, డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ అరుణ, డాక్టర్ రాజకుమారి, డాక్టర్ జ్యోత్స్న, ఆర్డీఓ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News